డ్యామిట్‌.. కథ అడ్డం తిరిగింది.!

నేను ఓడిపోయినా ఫర్లేదు, వాడు మాత్రం గెలవకూడదు.. అన్న ఆలోచనలో చాలామంది వుంటారు. హమ్మయ్య.. వాడు ఓడిపోయాడు.. అంటూ తన ఓటమిని సైతం పండగ చేసుకునేవారు చాలామంది కన్పిస్తారు. పొరపాటున అవతలోడు గెలిస్తే, ఇక అంతే సంగతులు.. ఆ గెలుపును అభినందించడం చేతకాదు సరికదా, ఆ గెలుపుపై బురద జల్లడం షురూ చేస్తారు. 

టీడీపీ నేతల పరిస్థితి ఇప్పుడు అచ్చం అలానే వుంది. దేశవ్యాప్తంగా పలువురు ముఖ్యమంత్రులకు పీడీపీ అసోసియేట్స్‌ అనే సంస్థ ర్యాంకింగులు ఇచ్చింది. తాము నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ ర్యాంకుల్ని పీడీపీ సంస్థ ప్రకటించింది. అందులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి మొదటి ర్యాంక్‌ లభించిన విషయం విదితమే. ఇంకేముంది, తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు పండగ చేసుకుంటున్నాయి. అయినా, తెలంగాణకి ఫస్ట్‌ ర్యాంక్‌ రావడం ఇదే తొలిసారి కాదు. చాలా విషయాల్లో, చాలా సందర్భాల్లో తెలంగాణ పండగ చేసుకోడానికి చాలా విషయాలు తెరపైకొచ్చాయి. 

సరే, ఈ ర్యాంకింగుల్లో నిజమెంత.? అనే విషయం పక్కన పెడితే, వచ్చిన ర్యాంక్‌ కొత్త ఉత్సాహాన్ని నింపడం సహజాతి సహజం. పొరపాటున ర్యాంకింగ్‌ తేడా కొడితే, కాస్త జాగ్రత్తపడి, ఇంకాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయడానికి అవకాశం దొరుకుతుంది. దేన్నయినా స్పోర్టివ్‌గా తీసుకునేవారికి వర్తిస్తుందిది. 

తమ ముఖ్యమంత్రికి ఏడో ర్యాంక్‌ రావడం పట్ల ఆవేదన సంగతెలా వున్నా, తెలంగాణ ముఖ్యమంత్రికి తొలి ర్యాంక్‌ వచ్చినందుకు టీడీపీ నేతలు తెగ ఇదయిపోతున్నారు. అసలు పీడీపీ అనే సంస్థ ఎక్కడుందో తమకు తెలియదంటూ టీడీపీ సీనియర్‌ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు వెటకారం చేశారు. అంతేనా, నిద్రపోయే సీఎంకి మొదటి ర్యాంక్‌ ఎలా ఇచ్చారని ప్రశ్నించేశారాయన. 

ఇక, గతంలో కేంద్రం తరఫున వివిధ రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. అప్పట్లో ఆ ర్యాంకింగులు బయటకు రాకుండా చంద్రబాబే అడ్డుకున్నారన్న గుసగుసలు ఇప్పటికీ విన్పిస్తున్నాయి. అలా చంద్రబాబు ఆ ర్యాంకింగుల్ని అడ్డుకోవడానికి కారణం తెలంగాణ ముఖ్యమంత్రికి తనకన్నా మెరుగైన ర్యాంక్‌ రావడమేనట. ఇదెంత నిజం.? అన్నది పక్కన పెడితే, తెలంగాణ మిగులు రాష్ట్రం గనుక, హైద్రాబాద్‌ లాంటి మహా నగరం రాజధాని గనుక, తేలిగ్గానే తెలంగాణకు ర్యాంకులు వచ్చేస్తాయి. దీని పట్ల ఆత్మన్యూనతతో బాధపడాల్సిన అవసరమైతే చంద్రబాబుకి లేదు. 

అంతర్జాతీయ స్థాయి రాజధానిని నిర్మిస్తానని చెబుతున్న చంద్రబాబు, ఆ దిశగా చర్యల్లో వేగం పెంచితే, ర్యాంకింగులదేముంది.? ఎలాగైనా వచ్చేస్తాయి. అయినా, ఇక్కడ చంద్రబాబు సంతోషపడ్డానికి ఓ ఛాన్స్‌ వుండనే వుంది. ఏడో ర్యాంక్‌ అంటే చిన్నదేమీ కాదు. ఆర్థిక ఇబ్బందుల్లో వున్న రాష్ట్రానికి ఈ ర్యాంక్‌ వచ్చిందంటే చంద్రబాబు ఒకింత సంబరపడి తీరాలి. ఎందుకంటే, వెనక నుంచి తొలి స్థానంలోకి వెళ్ళిపోయాం విభజనతో.. అని ఇదే చంద్రబాబు పదే పదే చెబుతున్నారు గనుక.

Show comments