హీరోయిన్‌ కిడ్నాప్‌ కథ

తమిళ హీరోయిన్‌ భావన కిడ్నాప్‌కి గురయ్యింది. అదృష్టవశాత్తూ ఆమె ప్రాణాలతో బయటపడింది. ఆమెను కిడ్నాప్‌ చేసింది ఎవరో కాదు, సాక్షాత్తూ ఆమె కారు డ్రైవరేనట. తన డ్రైవర్‌ తనను కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించాడనీ, ఈ క్రమంలో కొందరు అతనికి సహకరించారనీ, వారంతా తనతో అసభ్యకరంగా ప్రవర్తించారనీ, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, వీడియోలు, ఫొటోలు కూడా తీశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది భావన. 

తెలుగులో భావన పలు సినిమాల్లో నటించింది. శ్రీకాంత్‌ హీరోగా నటించిన 'మహాత్మ' సినిమాతోపాటు, గోపీచంద్‌ హీరోగా నటించిన 'ఒంటరి' సినిమాల్లో భావన హీరోయిన్‌గా నటించిన విషయం విదితమే. నితిన్‌ సరసన 'హీరో' అనే సినిమాలోనూ హీరోయిన్‌గా నటించింది భావన. 

ప్రస్తుతం కన్నడ, మలయాళ సినిమాల్లో నటిస్తోన్న భావన, ఓ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో ఎర్నాకులం వద్ద ఈ కిడ్నాప్‌ ఉదంతం చోటుచేసుకుంది. భావన ఫిర్యాదు మేరకు నిందితుల్లో ఇద్దర్ని పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. వారిలో ఒకరు ఆమె కారు డ్రైవర్‌ కాగా, మరొకరు కూడా భావన వద్ద పనిచేసే వ్యక్తే కావడం గమనార్హం.

భావన కిడ్నాప్ ఉదంతం సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది. అత్యంత నమ్మకస్తుల్నే కారు డ్రైవర్లుగా నియమించుకుంటుంటారు సినీ ప్రముఖులు. హీరోయిన్లు ఈ విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. అలాంటిది, భావన విషయంలో ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడంలేదని సినీ జనం ఆశ్చర్యపోతున్నారు.

Show comments