చంద్రబాబుకి బిగ్‌ బ్లో: 1000 నోట్లూ వచ్చేస్తున్నాయ్‌.!

'నేనే కేంద్రానికి విజ్ఞప్తి చేశాను 100, 500 రూపాయల నోట్లు రద్దు చేసెయ్యమని.. 1000 రూపాయలు రద్దు చేసినందుకు థ్యాంక్స్‌... 2000 రూపాయల నోట్లు అవసరం లేదు, దానిపై చర్చ జరగాలి.. పరిస్థితి పొయ్యి మీద నుంచి పెనంలోకి పడ్డట్లయ్యింది..' 

- ఇదీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ప్రధాని నరేంద్రమోడీ 1000, 500 నోట్ల రద్దు ప్రకటన అనంతరం చేసిన వ్యాఖ్యల సారాంశం. 

కానీ, చంద్రబాబు మాటల్ని కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదనే విషయం స్పష్టమయిపోయింది. 2000 నోట్లు, 500 నోట్లకు తోడుగా, కొత్తగా 1000 రూపాయల నోట్లు కూడా రాబోతున్నాయని కేంద్రం ప్రకటించేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల సెక్రెటరీ శక్తినాథ్‌దాస్‌ ప్రకటించేశారు. 

అంటే, పచ్చ నోట్లతోనే అవినీతి పెరిగిపోతోన్న దరిమిలా.. ఆ అవినీతిని రెట్టింపు చేయడానికి, ఇంకా పెంచేయడానికి 500, 1000 నోట్లకు అదనంగా 2000 రూపాయల నోట్లు తీసుకొచ్చారన్నమాట. ఈ దెబ్బతో అవినీతి ఎలా అంతమవుతుంది.? అన్న ప్రశ్న దేశవ్యాప్తంగా ఉత్పన్నమవుతోంది. దేశంలో కరెన్సీ కల్లోలం సృష్టించేసిన నరేంద్రమోడీ, ఎంచక్కా విదేశీ పర్యటనలకు వెళ్ళిపోయారు. 

ఇంతలోనే చావుకబురు చల్లగా బయటపడింది. నోట్ల రద్దు కాదు, మార్పిడి మాత్రమే.. అంటూ ఆర్‌బిఐ పదే పదే చెబుతూ వస్తోంది. కానీ, నరేంద్రమోడీ దేశాన్ని ఉద్ధరించేస్తున్నారనే భజనలో మొత్తంగా మన మీడియా అంతా మునిగి తేలుతోంది. ఈ క్రమంలోనే ముందుగా కేంద్రానికి థ్యాంక్స్‌ చెప్పేసి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాలిక్కర్చుకున్నారు. పెనం మీద నుంచి పొయ్యిలో కాదు.. పాతాళంలో పడిపోయిందిప్పుడు పరిస్థితి. 

మిగతావారి సంగతేమోగానీ, ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా అది తన ఘనతేనని చెప్పుకునే చంద్రబాబుకి ఇది నిజంగానే పెద్ద షాక్‌. డోనాల్డ్‌ ట్రంప్‌ చూడండి.. ఆయనకు ముగ్గురు భార్యలు.. అది అనైతికం.. అంటూ నోరు జారేసి, అలాంటోళ్ళని తిరస్కరిస్తారు ప్రజలు.. అని స్పీచ్‌లు ఇచ్చేసి, ట్రంప్‌ గెలిచాక.. అనవసర విషయంలో అత్యుత్సాహం చూపానని నాలిక్కర్చుకోవాల్సి వచ్చింది చంద్రబాబుకి. నోట్ల వ్యవహారంలోనూ చంద్రబాబుది అదే పరిస్థితి.

Show comments