ఇది ప్రజాస్వామ్యమా.? సిగ్గు సిగ్గు.!

ఇది ప్రజాస్వామ్యమా.? కానే కాదు, ఇది నరేంద్రమోడీ మార్క్‌ రాచరికం. రాచరికంలో రాజు చెప్పిందే వేదం. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. కానీ, ఇక్కడ అమల్లో ఉన్నది నరేంద్రమోడీ రాచరిక పాలన మాత్రమే. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. రాజ్యసభలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిథులు ఆంద్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలన్నారు. బీజేపీ మినహా అన్ని పార్టీలదీ అదే వాదన. బీజేపీ తప్ప ఏ ఒక్క పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తే తాము వ్యతిరేకిస్తామని చెప్పలేదు. 

ఒక్కమాటలో చెప్పాలంటే ఈ రోజు రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ ఏకాకి అయ్యింది. బీజేపీ మిత్రపక్షాలే, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ వైఖరిని తీవ్రంగా ఖండించాయి. ఇప్పుగిక, బీజేపీకి వేరే మార్గమే లేదు తప్పించుకోడానికి. కానీ, అక్కడున్నది నరేంద్రమోడీ. ఎవడేమనుకున్నా డోన్ట్‌ కేర్‌.. నేను అధికారంలో వున్నాను. నేనే కింగ్‌.. నేను చెప్పిందే వేదం.. నేను చెప్పిందే శాసనం.. అన్నట్లుంది వ్యవహారం. 

మామూలుగా అయితే ఆంధ్రప్రదేశ్‌ విషయంలో రాజ్యసభలో వివిధ పార్టీలు తమ తీరుని నిరసిస్తున్నప్పుడు, బీజేపీ సభ్యులు అడ్డుతగలాలి, తమ వాదన విన్పించాలి. కానీ, అలా వాదించడానికి ఎవరిదగ్గరా 'మేటర్‌' లేదు. అందుకే, ఓ దశలో వెంకయ్యనాయుడు కూడా 'సినిమా స్టోరీ' చెప్పాల్సి వచ్చింది. స్వర్గీయ ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ఓ సినిమాలోని డైలాగుల్ని, ఆ స్టోరీ లైన్‌నీ చెప్పేందుకు ప్రయత్నించారు. దిగజారుడు రాజకీయాలకు ఇది పరాకాష్ట.. అనడంలో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. 

చర్చ ఈ రోజుతో ముగిసిపోలేదు.. రేపు కూడా చర్చ కొనసాగనుంది. దాంతో, రేపు సభలో ప్రభుత్వం తరఫున అరుణ్‌ జైట్లీ ఎలాంటి వివరణ ఇస్తారనే విషయమై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఒకటి మాత్రం నిజం. ప్రజాస్వామ్యంలో అందరి అభిప్రాయాలకూ గౌరవం ఇవ్వాలి. అలా అందరి అభిప్రాయాలకూ గౌరవం ఇవ్వకపోయినా, మెజార్టీ అభిప్రాయానికైనా విలువ ఇవ్వాలి. చట్ట సభల్లో మెజార్టీ అభిప్రాయమే ఫైనల్‌. రాజ్యసభలో మెజార్టీ అభిప్రాయమేంటో తేలిపోయింది.  Readmore!

రాజ్యసభకు సంబంధించినంతవరకూ ప్రత్యేక హోదాపై దాదాపు ఏకాభిప్రాయం వచ్చిందనే చెప్పొచ్చు. ఈ రోజు మాట్లాడిన సభ్యులనే పరిగణనలోకి తీసుకుంటే 10కి పైగా పార్టీలు, మొత్తంగా అన్ని రాష్ట్రాలూ ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని నినదించాయి. అంటే, ప్రత్యేక హోదాకి బీజేపీ మాత్రమే మోకాలడ్డిందనే విషయం తేలిపోయింది కదా. ఇక, ఇప్పుడు తప్పించుకోడానికి అరుణ్‌ జైట్లీ ఎలాంటి కుప్పి గంతులు వేస్తారో వేచి చూడాల్సిందే. 

కొసమెరుపు: ఈ సభ ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చలేకపోవడమేంటే, అసలు ఈ సభ ఎందుకు.? అన్న అభిప్రాయాన్ని చాలామంది సభ్యులు వెలిబుచ్చారు. ఇది చాలు.. బీజేపీ కళ్ళు తెరవడానికి. అయినా కళ్ళు తెరవలేదంటే, కళ్ళుండీ కనిపించని కబోదిలా బీజేపీని లెక్కేయాల్సి వుంటుంది.

Show comments