చెన్నయ్‌తో పనైపోయిందా?

తెలంగాణలో అజ్ఞాతంలో ఉంటూ కొంతకాలంగా చెన్నయ్‌లోని ఆర్‌కేనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో యమ హడావుడి చేసిన మాజీ ఎంపీ కమ్‌ తెలంగాణ కాంగ్రెసు నాయకురాలు విజయశాంతికి చెన్నయ్‌తో పనైపోయిందా? అయిపోయిందనే చెప్పుకోవాలి. ఇంకా అక్కడే ఉందో, తిరిగి హైదరాబాదుకు వచ్చిందో తెలియదుగాని ఆమె చేసిన హడావుడి హంగామా బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. విజయశాంతి ప్రియతమ నాయకురాలు శశికళను, ఆమె అక్క కుమారుడు దినకరన్‌ను అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించడంతో, వారి కథ కంచికి చేరడంతో మాజీ హీరోయిన్‌కు చెన్నయ్‌తో పనిలేకుండా పోయింది. ఆర్‌కేనగర్‌ ఉపఎన్నిక వాయిదా పడిన తరువాత కూడా ఈమధ్య వరకు (శశికళ, పన్నీరుశెల్వం వర్గాలు ఏకమవ్వాలని నిర్ణయించుకోవడానికి ముందు వరకు) ఆర్‌కేనగర్‌లో ఉంటూ అన్నాడీఎంకే శశికళ వర్గం అభ్యర్థి దినకరన్‌ తరపున జోరుగా ప్రచారం చేసిన విజయశాంతి తాజా పరిణామాలతో కంగుతిని తిరుగు ప్రయాణం కట్టే ఉంటుంది. మళ్లీ తొందరలోనే ఉపఎన్నిక జరుగుతుండొచ్చు.

అయినప్పటికీ విజయశాంతి ప్రచారం చేసే అవకాశంలేదు. అన్నాడీఎంకేలోని రెండువర్గాలు ఒక్కటై శశికళను, దినకరన్‌ను బహిష్కరించడంతో మొన్నటివరకు పులిలా ఉన్న ఆయన పిల్లిలా మారిపోయాడు. తాను ఆర్‌కే నగర్‌ ఉపఎన్నికలో పోటీ చేయనని ప్రకటించాడు. అలా ప్రకటించకపోయినా ఆయన్ని పోటీచేయించే అవకాశం ఎలాగూలేదు. పళనిసామి, పన్నీరుశెల్వం వర్గాలు అధికారికంగా ఏకమైపోతే మళ్లీ పాత అన్నాడీఎంకే అమల్లోకి వస్తుంది. ఎన్నికల సంఘం ఇప్పటివరకు స్తంభింపచేసిన ఎన్నికల చిహ్నం 'రెండాకులు' తిరిగి ఇచ్చేస్తుంది. కాబట్టి అన్నాడీఎంకే తరపున కొత్త అభ్యర్థిని ప్రకటిస్తారు. మన్నారుగుడి మాఫియాను ఆర్‌కేనగర్‌లో అడుగుపెట్టనివ్వరు. ఈ మన్నారుగుడి మాఫియా నాయకురాలు శశికళకు వీరాభిమాని అయిన విజయశాంతికి ఆ నియోజక వర్గానికి వెళ్లే అవకాశమేలేదు. తెలంగాణ కాంగ్రెసులో మౌనంగా ఉంటూ, ఒక్కసారి కూడా ఎన్నికల ప్రచారం చేయని విజయశాంతి ఏ ప్లాన్‌తో ఆర్‌కే నగర్‌లో ప్రచారం చేసిందో తెలియదు. అన్నాడీఎంకేలోని రెండువర్గాలు కలవడానికి మార్గం సుగమం అయ్యేవరకు ఇంకా చెప్పా లంటే రెండాకుల గుర్తుకోసం దినకరన్‌ ఎన్నికల కమిషన్‌లోని ఒక సభ్యుడికి యాభైకోట్ల లంచం ఇవ్వజూపాడనే ఆరోపణలు వచ్చేంతవరకు విజయశాంతి చెన్నయ్‌లోనే ఉంది. 

ఈ మధ్యనే ఓ తెలుగు టీవీ ఛానెల్‌తో రెండు మూడు నిమిషాలపాటు మాట్లాడటమే ఇందుకు నిదర్శనం. 'మెరుగైన సమాజం' కోసం పనిచేస్తున్నట్లు చెప్పుకుంటున్న టీవీ ఛానెల్‌ రిపోర్టర్‌ చెన్నయ్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్న విజయశాంతితో చిన్నపాటి ఇంటర్వ్యూ చేశారు. పూర్తి మేకప్‌తో అప్పటి హీరోయిన్‌ను గుర్తుకు తెచ్చేలా ఉన్న తెలంగాణ రాములమ్మ ఎంతో హుషారుగా ప్రచార వాహనం మీది నుంచి రిపోర్టర్‌తో మాట్లాడింది. ఆర్‌కే నగర్‌ ఉపఎన్నిక వాయిదా పడటానికి బీజేపీ చేసిన కుట్రే కారణమని చెప్పింది. 'అమ్మ' మరణం వెనక ఎలాంటి కుట్రలు, కుతంత్రాలు లేవని, అదంతా సహజంగా జరిగిందేనని చెప్పింది. పన్నీరుశెల్వంపై విమర్శలు చేసింది. ఈమధ్య జరిగిన ఆదాయపన్ను దాడులపై మండిపడింది. ఆర్‌కే నగర్‌లో శశికళ వర్గం అభ్యర్థి దినకరన్‌ విజయం సాధిస్తాడనే ధీమా వ్యక్తంచేసింది. ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన ఈమె తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిర్వహించిన సభలో ప్రసంగించింది. తిరిగింది. పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన ప్పుడు అక్కడ తెలుగు జనాభా ఎక్కువున్న ప్రాంతాల్లో తెలుగు సినిమా తారలు, రాజకీయ ప్రముఖులు ప్రచారం చేయడం మామూలే. అయితే సాధారణ ఎన్నికలప్పుడే ఇలా చేస్తుంటారు.

కాని విజయశాంతి ఉపఎన్నికలో ప్రచారం చేయడానికి వెళ్లింది. వాస్తవానికి ఇది మామూలు ఉపఎన్నిక కాదు. అన్నాడీఎంకేను నిలువునా చీల్చిన ఈ ఉపఎన్నిక కాబట్టి ప్రాముఖ్యం సంతరించుకుంది. ఈ ఉపఎన్నిక ప్రచారంలో విజయశాంతి ప్రచారంచేయడం తప్పుకాదు. విచిత్రమూ కాదు. ఆమె తెలంగాణలో నాయకురాలైనప్పటికీ జయలలితకు సన్నిహితురాలు. జయకు రాములమ్మంటే చాలా ఇష్టమట...! కాబట్టి అమ్మ మీది ప్రేమ కొద్దీ ఆమె ప్రియసఖి శశికళవర్గం అభ్యర్థిని గెలిపించడానికి చెన్నయ్‌ వెళ్లింది. కాని ఇప్పుడు కథ మారిపోయింది. తెలంగాణలో నిరసక్తంగా ఉంటూ చెన్నయ్‌లో హుషారుగా ప్రచారం చేయడంతో మీడియాలో అనేక ఊహాగానాలు హల్‌చల్‌ చేశాయి. ఆమె పర్మినెంట్‌గా చెన్నయ్‌కి షిఫ్ట్‌ అవుతుందా? అన్నాడీఎంకే శశికళ వర్గంలో చేరి అక్కడి రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలనే ఆలోచన ఉందా? అనే ప్రశ్నలూ తలెత్తాయి. తాజా పరిణామాలతో ఈ ప్రశ్నలకు, అనుమానాలకు తెరపడినట్లే భావించాలి. శశికళ, దినకరన్‌ కథ ముగి సిపోవడం విజయశాంతికి బాధాకరమే. కాని ఏం చేయ గలదు పాపం...!

-మేనా

Show comments