హిందీ వసూళ్ళు భళి భళిరా.. 'బాహుబలి'

సినిమా రిలీజ్‌కి ముందు క్రియేట్‌ అయిన హైప్‌తో తొలి రోజు ఆ మాత్రం వసూళ్ళు రావడం మామూలే.. రెండో రోజు ఆటోమేటిక్‌గా ఆ మేనియా వుంటుంది.. మూడో రోజు ఆదివారం కదా.. ఆ మాత్రం వుండవేంటి.? మరి, నాలుగోరోజు.. అదీ 'నాన్‌ హాలీడే' వసూళ్ళు ఆ స్థాయిలో వుండటమంటే చిన్న విషయం ఏమీ కాదు. 'బాహుబలి'కి రిలీజయిన రోజు - వీకెండ్‌ తర్వాతి రోజూ దాదాపు ఒకేలా వసూళ్ళూ వచ్చిపడ్తున్నాయి. నేడు, మంగళవారం కూడా థియేటర్లలో ఆక్యుపెన్సీపై పాజిటివ్ రిపోర్ట్స్ వస్తుండడం గమనార్హం. 

ఓ తెలుగు సినిమా, హిందీలోకి డబ్‌ అయితే ఎంత గొప్ప సినిమా అయినా ఓ మోస్తరు వసూళ్ళు మాత్రమే వుంటాయన్న పాత మాట, 'బాహుబలి ది బిగినింగ్‌'తోనే 'ట్రాష్‌'లోకి వెళ్ళిపోయాయి. 'బాహుబలి ది కంక్లూజన్‌'తో ఏకంగా, బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకే షాక్‌ తగిలింది. అలా ఇలా కాదు, 'బాహుబలి ది కంక్లూజన్‌' రికార్డుల్ని తుడిచేయడం అక్కడి స్టార్‌ హీరోలకి కనాకష్టమయ్యేంతలా షాకిచ్చింది.

శుక్రవారం (ఏప్రిల్‌ 28) సినిమా విడుదలయ్యింది. ఆ రోజు 41 కోట్లు వసూలయ్యాయి. శనివారం 40 కోట్ల 50 లక్షలు, ఆదివారం 46 కోట్ల 50 లక్షలు, సోమవారం 40 కోట్ల 25 లక్షలు.. ఈ ఫిగర్స్‌ ఇప్పుడు బాలీవుడ్‌ ట్రేడ్‌ పండితుల్నే ఆశ్చర్యపరుస్తున్నాయి. మొత్తంగా నాలుగు రోజులకి కేవలం హిందీ వెర్షన్‌ వసూలు చేసిన మొత్తం 168 కోట్ల 25 లక్షలు. ఇది కనీ వినీ ఎరుగని రికార్డ్‌గానే చెప్పుకోవాలి. 

ఆసక్తికరమైన విషయమేంటంటే తెలుగుతో ధీటుగా, అంతకన్నా ఎక్కువగా 'బాహుబలి ది కంక్లూజన్‌' హిందీలో వసూళ్ళ పంట పండిస్తుండడం. ఈ జోరు ఇలాగే కొనసాగితే, 500 కోట్లు చాలా చిన్న టాస్క్‌.. వెయ్యి కోట్లను చేరుకోవడం కూడా పెద్ద విషయమేమీ కాదు. గ్రాస్‌ వసూళ్ళలో ఇప్పటికే 505 కోట్లు దాటేసినట్లు అంచనాలు విన్పిస్తోన్న విషయం విదితమే.

Show comments