జనసేనానీ.. ఏంటా ఆవేశం.?

పవన్‌కళ్యాణ్‌కి మళ్ళీ వీరావేశమొచ్చింది. మైకులు బెదిరిపోయాయ్‌.. సౌండ్‌ బాక్సులు బద్దలయిపోతాయేమో అన్పించింది. ఎక్కడినుంచో ఆవేశం రప్పించేసుకుని (అరువు తెచ్చుకుని కాదు కదా..) గొంతు చించేసుకున్నారు. 'లడాయేంగే.. లడాయేంగే..' అంటూ హిందీలో ఏదో డైలాగ్‌ చెప్పేశారు. ఇంగ్లీషులోనూ దంచేశారు. ఆ ఆవేశం చూస్తే, ఏంటీ పవన్‌కళ్యాణ్‌ నిజంగానే చిత్తశుద్ధితో రాజకీయాలు చేసేస్తున్నాడా.? అన్న అనుమానం కలగలేదు సరికదా, కామెడీ అయిపోయింది. 

నిజంగా ఆవేశపడితే, ఆవేదన వ్యక్తం చేస్తే.. అందులో క్లారిటీ వుంటుంది. ఎంతైనా నటుడు కదా.. తన నటనా ప్రతిభ అంతా ఉపయోగించేశాడుగానీ, తిరుపతి బహిరంగ సభలో పవన్‌కళ్యాణ్‌ ఆవేశం తేలిపోయింది. ఎందుకంటే, పవన్‌కళ్యాణ్‌లోని ఈ ఆవేశానికి జనం అలవాటైపోయారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నేతగా పవన్‌లో ఆవేశం చూశాం. 2014 ఎన్నికల సమయంలో జనసేనాధిపతిగా ఇదే ఆవేశం చూశాం. పవన్‌ ఆవేశాన్ని చూసీ చూసీ తెలుగు ప్రజలు బోర్‌ ఫీలవుతున్నారు. 

మన ఎంపీలకు హిందీ రాదు, ఢిల్లీ నేతలకు తెలుగు రాదు.. అంటూ పవన్‌కళ్యాణ్‌ పంచ్‌ డైలాగులు పేల్చాడు. నాన్సెన్స్‌ అనాలో, ఇంకేమన్నా అనాలో అర్థం కావడంలేదు పవన్‌ వ్యాఖ్యల్ని చూస్తే, హిందీ రాకపోతేనేం, ఇంగ్లీషులో మేనేజ్‌ చేసేస్తున్నారు కదా.! ఏం చేస్తాం, ఖర్మ.. అలా సరిపెట్టుకోవాల్సిందే. అయినాసరే, హిందీ వస్తే మాత్రం.. హిందీలో అడిగితే మాత్రం, ప్రధాని నరేంద్రమోడీ దిగొస్తారా.? ఛాన్సే లేదు. 

రెండేళ్ళ క్రితం పార్టీ పెట్టి, టీడీపీ - బీజేపీ జెండాలు మోసిన విషయాన్ని పవన్‌కళ్యాణ్‌ మర్చిపోయినట్టున్నారు. ఏ పార్టీ జెండా మోయాల్సిన అవసరం తనకు లేదని పవన్‌ చెబుతున్నాడుగానీ, పవన్‌ ఆయా పార్టీల జెండాల్ని మోసిన వైనాన్ని తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. పవన్‌కళ్యాణ్‌ కాస్తా ప్యాకేజీ కళ్యాణ్‌గా ఎప్పుడో మారిపోయాడు. ఏ ప్యాకేజీల కోసమో పవన్‌ ఇప్పుడు ఇదిగో, ఈ ఆవేశం ప్రదర్శిస్తున్నాడన్న విమర్శలకు తిరుపతి బహిరంగ సభ తావిచ్చిందంతే. అంతకు మించి, తిరుపతి బహిరంగ సభతో పవన్‌ కళ్యాణ్‌ ఆంధ్రప్రదేశ ప్రజలకు ఇచ్చిన భరోసా ఏమీ లేదు.

Show comments