'కబాలి'ని కాపాడలేకపోయారు

రజనీకాంత్‌ తాజా చిత్రం 'కబాలి' రేపు విడుదల కానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని భారీ హంగామా నడుమ విడుదల చేస్తున్నారు. థియేటర్ల సంఖ్య, ప్రదర్శనల సంఖ్య.. ఇలా అన్నిట్లోనూ 'కబాలి'దే రికార్డ్‌.. అనే స్థాయిలో విడుదలకు ప్లాన్‌ చేశారు. ఏం చేసినా, 'పైరసీ - లీక్‌' అనే ప్రమాదం నుంచి మాత్రం సినిమాని కాపాడలేకపోతున్నారు చిత్ర నిర్మాత. 

తాజాగా, 'కబాలి' ఇంట్రడక్షన్‌ సీన్‌ ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైపోయింది. జైలుకు సంబంధించిన సన్నివేశమది. దాంతో, నిర్మాతల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. సినిమా మొత్తం ఆన్‌లైన్‌లో లీక్‌ అయిపోయిందంటూ వారం పది రోజులుగా గాసిప్స్‌ గుప్పుమంటోన్న విషయం విదితమే. అయితే, తొలిసారిగా ఆ లీక్‌కి సంబంధించి ఆధారాలు వెలుగు చూశాయి. ప్రస్తుతానికైతే ఇంట్రడక్షన్‌ సీన్‌కి సంబంధించే లీకేజీ వార్తలొస్తున్నాయి. రేపటికల్లా ఇంకెలాంటి వార్త వినాల్సి వస్తుందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 

మరోపక్క, లీక్‌ - పైరసీ వంటివాటిని అరికట్టేందుకు ఏకంగా నిర్మాత కోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. ఇంటర్నెట్‌పై ఇప్పటికే రజనీ అభిమానుల నిఘా కొనసాగుతోంది. అయినా, యధేచ్ఛగా 'కబాలి' ఇంట్రడక్షన్‌ సీన్‌ ఇంటర్నెట్‌లో సర్క్యులేట్‌ అయిపోతుండడం గమనార్హం. ఇదిలా వుంటే, 'లీక్‌' అవడం కూడా ఓ పబ్లిసిటీ స్టంటేనని కొందరు కొట్టి పారేస్తున్నారు.

Readmore!
Show comments