మంచు లక్ష్మికి 'ఆసక్తి' లేదట.. నమ్మొచ్చా.?

రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి తనకు ప్రస్తుతానికైతే లేదంటోంది మంచు మోహన్‌బాబు కుమార్తె, నటి, నిర్మాత మంచు లక్ష్మిప్రసన్న. గత కొంతకాలంగా ఆమె రాజకీయాల్లోకి వస్తోందంటూ ప్రచారం జోరుగా సాగుతున్న విషయం విదితమే. కుమార్తె రాజకీయ రంగ ప్రవేశం కోసమే మోహన్‌బాబు, వివిధ రాజకీయ పార్టీలతో సన్నిహిత సంబంధాలు 'ఇంకాస్త ఎక్కువగా' కొనసాగిస్తున్నారన్నది సినీ, రాజకీయ వర్గాల్లో విన్పిస్తోన్న గుసగుసల సారాంశం. 

అయితే, అవన్నీ ఉత్త గాసిప్స్‌ మాత్రమేనని మంచు లక్ష్మి తేల్చి చెప్పింది. రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి ప్రస్తుతానికైతే లేదనీ, తనకు చేతనైనంతమేర 'సేవ' చేస్తూనే వున్నాననీ, ఓ వైపు సినిమాలు ఇంకో వైపు సేవా కార్యక్రమాలతో బిజీగా వున్నానని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది. 

బీజేపీతోపాటు, వైఎస్సార్సీపీతో మోహన్‌బాబు టచ్‌లో వుండడం వెనుక, కుమార్తెను అసెంబ్లీకి లేదా పార్లమెంటుకు పంపాలన్న ఆలోచనే వుందనే ప్రచారం గట్టిగా జరుగుతున్న ప్రస్తుత తరుణంలో పొలిటికల్‌ ఊహాగానాల్ని మంచు లక్ష్మి కొట్టి పారేయడం విశేషమే మరి. ఇక, నిర్భయ ఘటనలో దోషులకు ఉరిశిక్ష విషయమై మంచు లక్షి విభేదించడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. అమ్మాయిల విలువేంటో వారికి అర్థమయ్యేలా చేయాలి తప్ప, ఉరిశిక్ష సమంజసం కాదని తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది మంచు లక్ష్మి. ఓ పక్క దేశమంతా, నిర్భయ హంతకులకు ఉరిశిక్ష పడాలని డిమాండ్‌ చేస్తోన్న వేళ మంచు లక్ష్మి భిన్నమైన వాదనను విన్పించడం విశేషమే మరి. 

నిర్భయ కేసుని విచారించిన పోలీసు అధికారులు, న్యాయస్థానాల్లో కేసుని వాదిస్తున్నవారు, ఆమెకు చివరి క్షణాల్లో వైద్య చికిత్స అందించిన డాక్టర్లు.. ఇలా ఒకరేమిటి, ప్రతి ఒక్కరూ నిర్భయ ఘటనలో దోషులందర్నీ ఉరితీయాలనీ, అదీ బహిరంగ ఉరే వారికి సరైనదనీ డిమాండ్‌ చేస్తున్న విషయం విదితమే. 'ఉరిశిక్ష కాదు.. వారిని బతికుండగానే మంటల్లో కాల్చి బూడిద చెయ్యాలి..' అని ఆనాటి నరకానికి బలైపోయిన నిర్భయ, చివరి క్షణాల్లో మరణవాంగ్మూలమిచ్చిందంటే.. ఆమె ఎంతటి రాక్షసత్వానికి బలైపోయిందో అర్థం చేసుకోవచ్చు.

Show comments