800 కోట్లు.. స్టిల్‌ బ్యాటింగ్‌ అక్కడ

అమీర్‌ఖాన్‌ ప్రధాన పాత్రలో రూపొందిన 'దంగల్‌' సినిమా లేటుగా చైనాలో విడుదలై, అద్భుతాలు సృష్టించేస్తోంది. తాజాగా ఈ సినిమా 800 కోట్ల మైలు రాయిని దాటేసిందక్కడ. ఈ స్థాయిలో ఇప్పటిదాకా ఏ భారతీయ సినిమా చైనాలో వసూళ్ళు సాధించలేకపోయింది. ఇండియా - ఇతర దేశాలతో కలుపుకుంటే వచ్చే మొత్తాన్ని అతి త్వరలో చైనా వసూళ్ళతో అధిగమించేయనుంది 'దంగల్‌'. ఇది ఓ రకంగా సరికొత్త రికార్డ్‌ అనుకోవాలి. 

రెజ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన 'దంగల్‌', బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్ళు సాధించిన స్ట్రెయిట్‌ సినిమా. ఆ మాటకొస్తే, 'బాహుబలి ది కంక్లూజన్‌' విడుదలయ్యేవరకూ, ఓ ఇండియన్‌ సినిమా అత్యధిక వసూళ్ళు సాధించిన రికార్డ్‌ 'దంగల్‌' పేరుతోనే వుండేది. 'బాహుబలి ది కంక్లూజన్‌' రాకతో 'దంగల్‌' రికార్డులు అటకెక్కిపోయాయి. చైనాలో 'దంగల్‌' విడుదలయ్యాక, ఈ సినిమా కొత్త ఇన్నింగ్స్‌ వసూళ్ళ పరంగా స్టార్ట్‌ చేసిందనుకోవచ్చు. 

ఇదిలా వుంటే, 'బాహుబలి ది కంక్లూజన్‌'ని చైనాలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'బాహుబలి ది బిగినింగ్‌' చైనాలో ఫెయిలవడంతో, 'బాహుబలి ది కంక్లూజన్‌' అక్కడేం చేస్తుందోనన్న ఉత్కంఠ మాత్రం అలాగే వుంది. 

Show comments