అటు ఇఫ్తార్‌.. ఇటు ఈడీ.. మధ్యలో జగన్‌

ఓ పక్క ఇఫ్తార్‌ విందు.. ఇంకోపక్క ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అటాచ్‌మెంట్‌.. మధ్యలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌. చిత్రమైన సందర్భమే ఇది. ఎందుకంటే, వైఎస్‌ జగన్‌ విదేశీ టూర్‌ ముగించుకుని, తొలిసారి జనం ముందుకు వచ్చిన సమయంలోనే ఈడీ అటాచ్‌మెంట్‌ వార్త వెలుగు చూసింది. దాదాపుగా జగన్‌ ఆస్తులన్నీ ఇప్పుడు అటాచ్‌మెంట్‌లోనే వున్నాయంటూ జగన్‌ వ్యతిరేక మీడియాలో ప్రచారం గుప్పుమంటోందిప్పుడు. 

ఈడీ అటాచ్‌ చేసిన ఆస్తుల విలువ పూర్తిగా వెయ్యి కోట్లు కూడా లేదట. కానీ, ఓపెన్‌ మార్కెట్‌లో వాటి విలువ 5 వేల కోట్లు.. అంటూ జగన్‌ వ్యతిరేక మీడియా కథనాల్ని వండి వడ్డిస్తోంది. ఇంకా చిత్రమైన విషయమేంటంటే, టీడీపీ అధినేత చంద్రబాబు తన ఆస్తుల వివరాల్ని వెల్లడిస్తే, వాటి వాస్తవ విలువని మాత్రం సదరు మీడియా చెప్పదాయె.! 

సరే, ఈడీ అటాచ్‌ చేసినంతమాత్రాన.. ఇదేమీ జగన్‌ని పూర్తిగా ఇబ్బంది పెట్టే అంశంగా భావించాల్సిన అవసరం లేదు. ఈడీ అటాచ్‌మెంట్‌ని జగన్‌ న్యాయస్థానంలో సవాల్‌ చేసుకోవచ్చుగాక. లేదంటే, ముందు ముందు ఈ కేసులో పస లేదంటూ అటాచ్‌ చేసిన ఆస్తుల్ని ఈడీ వదిలేయొచ్చుగాక. జగన్‌ అక్రమాస్తుల కేసులో ఇప్పటిదాకా చాలామంది అరెస్టయ్యారు.. ఒకరొకరుగా బెయిల్‌ మీద విడుదలయ్యారు. కొందరు ఈ కేసుల్లోంచి ఉపశమనం కూడా పొందారు. 

దేశంలో కేసుల విచారణ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. కేసుల విచారణ తేలేటప్పటికి పుణ్యకాలం కాస్తా పూర్తయిపోతుంది. నిన్న దోషి, నేడు నిర్దోషి.. ఇదీ దేశంలో చట్టాల తీరు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. రేపేం జరుగుతుందన్నది ఇలాంటి కేసుల్లో ఇప్పుడే ఊహించేయడం కన్నా తొందరపాటు, అత్యుత్సాహం ఇంకొకటి వుండదు. 

వైఎస్సార్సీపీ హైద్రాబాద్‌లో ఇఫ్తార్‌ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే, ఆ కార్యక్రమంలో వైఎస్‌ జగన్‌ పాల్గొంటే, సరిగ్గా టైమ్‌ చూసి ఈడీ కథనాలు వదలడం వెనుక పెద్ద పొలిటికల్‌ కథే నడుస్తోందని అన్పించడం పెద్ద వింతేమీ కాదు. చాలా రోజుల తర్వాత జగన్‌ జనంలోకి వచ్చిన కాస్సేపటికే ఈడీ అటాచ్‌మెంట్‌ అంటే.. ఇందులో రాజకీయ జోక్యం లేదని ఎలా అనుకోగలం.? 

అందుకేనేమో, ఈడీ అటాచ్‌మెంట్‌పై స్పందించమని మీడియా జగన్‌ని కోరితే, స్పందించేందుకు ఆయన నిరాకరించారు. అంతకన్నా, ఆయన చెప్పడానిక్కూడా ఏమీ లేదు. అన్నట్టు, జగన్‌ ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందంటూ రెండేళ్ళుగా చంద్రబాబు సర్కార్‌ చెబుతూనే వుంది. సాక్షి మీడియా ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేసుందనీ చెబుతూ వస్తున్నారు అధికార పార్టీ నేతలు. ఏదీ, ఎక్కడ.? ఒక్కటంటే ఒక్క రూపాయి అయినా జగన్‌ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకుందా.? ఈడీ అటాచ్‌మెంట్లు కూడా అంతేనేమో.!

Show comments