చినబాబులు తయార్‌..!

తెలుగుదేశం పార్టీకి ఉత్తరాధికారిగా లోకేష్‌బాబు సిద్ధంగా ఉన్నారు, మరి, ఆ పార్టీని నమ్ముకుని రాజకీయం చేస్తున్న తమ్ముళ్లకు కూడా వారసులు ఉంటారు, ఉండాలి కూడాను. విశాఖ జిల్లాలో ఇపుడు వారసుల హవా బాగానే నడుస్తోంది. సీనియర్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి రాజకీయ వారసునిగా కుమారుడు అప్పలనాయుడు పెందుర్తి రాజకీయాలలో చాలాకాలంగా చక్రం తిప్పుతున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ రాజకీయాలను బాగానే వంటపట్టించుకున్నారు, తండ్రిని పక్కన పెట్టి మరీ పార్టీ సమావేశాలు కూడా నిర్వహించే స్తోమతను సంపాదించుకున్నారు.

ఇక, మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్‌ కూడా నర్శీపట్నం రాజకీయాలను ఔపాసన పట్టేశారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు ఆయన సన్నిహిత బంధువు రాజకీయంగా చేదోడు వాదోడుగా ఉంటున్నారు. వీరందరికీ కంటే ఓ ఆకు ఎక్కువ చదివిన వారు అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ కుమారుడు. తండ్రి అసెంబ్లీ సమావేశాలలో బిజీగా ఉంటే ఎమ్మెల్యే కుమారుడు ఏకంగా అధికారులతో అనధికార సమావేశాలు పెట్టి మరీ ఆదేశాలు జారీ చేయడం విశేషం. జీవీఎంసీ అధికారులను పిలిచి మరీ పనులు ఎక్కడ చేయాలో, ఎలా చేయాలో ఎమ్మెల్యే కుమారుడు ఆదేశాలు జారీ చేయడంతో తలలు పట్టుకోవడం అధికారుల వంతైంది. ఎమ్మెల్యే కొడుకు కావడంతో ఎదురు చెప్పలేక, కక్కలేక మింగలేక గంటల తరబడి అనధికార సమావేశంలో తలలు ఊపడంతోనే అధికారులకు సరిపోయింది. మొత్తానికి తెలుగుదేశం పార్టీ పుణ్యమాని ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులకు వన్‌ ప్లస్‌ వన్‌ ఆఫర్‌గా ప్రతీ నియోజకవర్గంలోనూ వారసులు తయారై  ఎమ్మెల్యేలు లేని లోటు తీర్చేస్తున్నారు.

Show comments