టీఆర్ఎస్ లో కాంగ్రెస్ నేతల లొల్లి!

కాంగ్రెస్ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వచ్చి చేరిన నేతల మధ్య లొల్లి రచ్చకు ఎక్కుతోంది. గ్రూప్ తగాదాలకు, నేతల మధ్య విబేధాలకూ వేదిక అయిన మహబూబ్ నగర్ జిల్లాలో గతంలో కాంగ్రెస్ లో ఎలాంటి లొల్లి జరిగిందో ఇప్పుడు తెరాసలో కూడా అలాంటి లొల్లే జరుగుతోంది. 

గతంలో డీకే అరుణ, జూపలి కృష్ణారావుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. వైఎస్ మరణానంతరం వీళ్ల మధ్య గొడవ పతాక స్థాయికి చేరింది. ఆఖరికి.. జూపల్లి కాంగ్రెస్ కు రాజీనామా చేసి వెళ్లిపోయాడు. తెరాసలో చేరాడు. ఇక తెలంగాణ రాష్ట్ర సమితిలో జూపల్లి కాస్త కుదురుకునే సరికి ఇక్కడకు వచ్చి చేరిన కాంగ్రెస్ నేతలతో ఆయనకు విబేధాలు తీవ్రం అవుతున్నాయి.

తాజాగా ఈ విబేధాలు రచ్చకు ఎక్కాయి. జూపల్లి  గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడని.. ఆయన దళిత వ్యతిరేకి అని, పార్టీలో లేని వాళ్లకు నామినేటెడ్ పోస్టులను ఇస్తున్నారని అంటూ.. జూపల్లిపై మంధా ధ్వజమెత్తాడు. 

మరి వీళ్లిద్దరి సంగతిలా ఉంటే.. డీకే అరుణను తెరాసలో చేర్చుకోవడానికి అధినేత కేసీఆర్ ఉత్సాహం చూపిస్తున్నాడనే మాటా వినిపిస్తోంది. ఇటీవల గద్వాల ప్రత్యేక జిల్లా విషయంలో డీకే అరుణ డిమాండ్ కు అనుగుణంగా స్పందించడం కూడా ఆమెను తెరాసలోకి ఆహ్వానించే యత్నమనే మాట వినిపిస్తోంది. మరి ఆమె గనుక తెరాసలో చేరితే.. ఈ జిల్లాలో ఈ పార్టీ పరిస్థితి గతంలో కాంగ్రెస్ నెలకొని ఉన్న స్థితి కి దిగజారుతుందేమో! Readmore!

Show comments