కొత్త చట్టం 'పచ్చ' అవినీతిపరులనూ కాటేస్తుందా?

ఆంధ్రప్రదేశ్‌లో అవినీతిపరులను ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి పక్కలో బల్లెంలా ఉన్న ప్రతిపక్ష నాయకుడు కమ్‌ వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ ఠారెత్తించే చట్టం వచ్చేసింది. జగన్‌ను చావుదెబ్బ తీయాలనే పట్టుదలతో ఉన్న సర్కారు పదునైన కోరలున్న చట్టాన్ని అమల్లోకి తెచ్చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక కోర్టుల చట్టాన్ని అమల్లోకి తెస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రపతి ఈ చట్టానికి ఆమోదం తెలపడంతో ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉపయోగించి అవినీతిపరుల ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చు. అవినీతి నిరోధక చట్టం ద్వారా ప్రభుత్వానికి ఇటువంటి అధికారం సంక్రమించలేదు. అది అంత శక్తిమంతమైంది కాదని ప్రభుత్వ భావన. 

దీంతో అవినీతిపరుల భరతం పట్టాలంటే బలమైన చట్టం ఉండాలని భావించిన బాబు సర్కారు గత ఏడాది సెప్టెంబరులో ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక కోర్టుల చట్టం బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింపచేసుకుంది. తరువాత దీన్ని రాష్ట్రపతికి పంపడంతో ఆయన కూడా సంతకం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు, కథనాలు రాస్తున్న, ప్రసారం చేస్తున్న వైఎస్‌ జగన్‌ ఆధ్వర్యంలోని సాక్షి మీడియాను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పలుమార్లు చెప్పారు. 

సాక్షి మీడియాను అవినీతి సొమ్ముతో పెట్టారని, అందుకే దాన్ని స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని బాబు, యనమల, ఇతర టీడీపీ నాయకులు అంటున్నారు. ఇప్పుడు చట్టం అమల్లోకి వచ్చింది కాబట్టి సాక్షి మీడియా స్వాధీనానికి పావులు కదుపుతారా?  సాక్షి స్వాధీనం సంగతి అటుంచితే ఆ టీవీ ఛానెల్‌ ప్రసారాలను నిషేధించి బాబు సర్కారు తన కక్ష ఎంత తీవ్రంగా ఉందో శాంపిల్‌ చూపించింది. కోర్టు ఆల్రెడీ బాబు కక్షపూరిత చర్యను ఆక్షేపించింది. ఈ కేసు విచారణలో బాబుకు ఎలాంటి అక్షింతలు పడతాయో చూడాలి. 

మీడియాను నిషేధించడానికి చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్ఫూర్తినిచ్చారేమో. ఆయన టీవీ 9, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఛానెళ్లపై నిషేధం విధించారు. టీవీ 9 కేసీఆర్‌కు లొంగిపోయి 'జై తెలంగాణ' పేరుతో ఛానెల్‌ ప్రారంభించగా, ఏబీఎన్‌ సుదీర్ఘం కాలం నిషేధాన్ని ఎదుర్కొంది. సాక్షిని ఇలాగే ముప్పుతిప్పలు పెట్టాలని చంద్రబాబు ఉద్దేశం.  జగన్‌ను దారుణంగా దెబ్బ కొట్టడానికే ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక కోర్టుల చట్టం చేసినట్లుగా కనబడుతోంది. ఈ చట్టాన్ని అవినీతిపరులైన టీడీపీ నాయకుల మీద కూడా ప్రభుత్వం ప్రయోగిస్తుందా? వారి ఆస్తులు స్వాధీనం చేసుకుంటుందా? చట్టాన్ని అవినీతిపరులందరికీ సమానంగా వర్తింపచేస్తుందా? టీడీపీలోని అవినీతిపరుల ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నప్పుడే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, పక్షపాతం లేదని అనుకోవచ్చు. 

కాని ప్రభుత్వ అంత నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందా? అనేది అనుమానమే. థియరీ ప్రకారం చట్టం ముందు అందరూ సమానులేగాని ఆయరణలో కొందరే సమానులనే సంగతి తెలిసిందే.  'ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌ కోర్ట్స్‌ యాక్ట్‌-2015 (ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక కోర్టుల చట్టం) ఉపయోగించి సాక్షి మీడియా గ్రూపును స్వాధీనం చేసుకుంటే  ఆ మీడియా గ్రూపు మీద యాజమాన్య నియంత్రణ ప్రభుత్వం చేతుల్లోకి వస్తుంది. కాని ఒక మీడియాను స్వాధీనం చేసుకోవడం అంత సులభమా? అలా జరిగితే ఎదురయ్యే పరిణామాలను కూడా ప్రభుత్వం ఎదుర్కోవల్సి వుంటుంది. ఇతర సంస్థలను స్వాధీనం చేసుకోవడం వేరు. 

మీడియా సంస్థను స్వాధీనం చేసుకోవడం వేరు.  ప్రభుత్వ ఉద్యోగుల అక్రమాస్తులను స్వాధీనం చేసుకోవడానికి ఒడిశా, బిహార్లో చట్టాలున్నాయి. అక్కడి చట్టాలను పరిశీలించాకే ఏపీ ప్రభుత్వం ప్రత్యేక కోర్టుల చట్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల అక్రమాస్తుల స్వాధీనానికి ఉపయోగించే చట్టాన్ని మీడియా గ్రూపు స్వాధీనానికి ఎలా ఉపయోగిస్తారనే సందేహం ఎవరికైనా వస్తుంది. మీడియాపై ప్రభుత్వాలు ఆంక్షలు విధించడం, టీవీ ఛానెళ్ల ప్రసారాలను నిషేధించడం ఇప్పటివరకు చూశాం.  జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంపై న్యాయస్థానంలో విచారణ జరుగుతున్న సంగతి తెలుసు. 

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడీ) జగన్‌ ఆస్తుల్లో కొన్ని అటాచ్‌ (జప్తు) చేసింది. అంటే ఆ ఆస్తులపై ఎలాంటి లావాదేవీలు జరగకూడదు. అటాచ్‌ చేసిన ఆస్తుల్లో సాక్షి కూడా ఉంది. అటాచ్‌మెంటులో ఉన్న ఆస్తిని స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని పాలకులు చెబుతున్నారు. కాని ఇదెలా సాధ్యం? జగన్‌ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. ఆయనను దోషిగానో, నిర్దోషిగానో తేల్చలేదు. అలాంటప్పుడు ఆయన ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చా? కొత్త చట్టం జగన్‌ కోసమే అయినట్లయితే చంద్రబాబు గడ్డు పరిస్థితి ఎదుర్కోవల్సివస్తుంది. 

Show comments