బాబు రచ్చ.. బీజేపీ మౌనమేల.?

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ పేరుతో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు రచ్చ రచ్చ చేసేస్తున్నారు. కేంద్రం ప్యాకేజీ ఖరారు చేసిందన్న ఊహాగానాలు ముందుగా టీడీపీ అనుకూల మీడియాలోనే ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇవన్నీ టీడీపీ కాంపౌండ్‌ నుంచి వచ్చినవేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. ఆ తర్వాత, మొత్తంగా తెలుగు మీడియాలో ఈ వ్యవహారంపై రకరకాల విశ్లేషణలు కన్పిస్తున్నాయి. 

అయితే, వాస్తవానికి ప్యాకేజీ ఇవ్వాల్సింది కేంద్రమే. అంటే, కేంద్రంలో వున్న భారతీయ జనతా పార్టీ.. ప్యాకేజీకి సంబంధించి, లీకుల్ని ఏపీకి చెందిన బీజేపీ నేతల ద్వారా బయటకు పంపి వుండాలి. కానీ, అలాంటిదేమీ జరిగినట్లు కన్పించడంలేదు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ హరిబాబు ఇప్పటిదాకా ఈ విషయమై స్పందించిన దాఖలాల్లేవు. 'కేంద్రం మెరుగైన సాయం అందించేందుకు కసరత్తులు చేస్తోంది..' అని ఈ మధ్యనే ఓ సందర్భంలో ఆయన వ్యాఖ్యానించారుగానీ, అది పరమ రొటీన్‌ వ్యాఖ్య మాత్రమే. 

సోము వీర్రాజు లాంటి నేతలు, కేంద్రంలో చిన్నపాటి కదలిక వున్నా హంగామా చేసేస్తారు. మంత్రులు మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్‌ కూడా అంతే. మిగతా బీజేపీ నేతలు తక్కువోళ్ళేమీ కాదు. కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి వెళ్ళిన మాజీ కేంద్ర మంత్రులు పురంధరీశ్వరి, కావూరి సాంబశివరావు ప్రత్యేక ప్యాకేజీ వచ్చే పరిస్థితులు వుంటే ఆగుతారా.? కన్నా లక్ష్మినారాయణ, ఏ ఛాన్స్‌ దొరికినా చంద్రబాబుని కడిగేద్దామనుకుంటారు.. ఆయనా మౌనమే దాల్చారు మరి. 

కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఈ ప్యాకేజీ వ్యవహారాలపై ఢిల్లీలో గట్టిగానే మాట్లాడుతున్నట్లు మీడియా ముందు హడావిడి చేస్తున్నారు. కానీ, బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాత్రం మౌనం దాల్చారు. దానర్థమేంటి.? 'ప్రత్యేక హోదా ఇస్తే సరే సరి, లేదంటే తెగతెంపులే..' అనేంత ధైర్యం చంద్రబాబుకి వుందా.? ఛాన్సే లేదు. పైగా, ఇప్పుడు చంద్రబాబు ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కయిపోయారు.  Readmore!

వరుసగా అన్ని పరిణామాల్నీ పరిగణనలోకి తీసుకుంటే, ఇదంతా టీడీపీ రచ్చ తప్ప.. ఢిల్లీ వేదికగా ఎలాంటి కదలికా లేదేమో.. అన్న అనుమానాలే బలపడ్తున్నాయి. ఏమో, ఏ పుట్టలో ఏ పాము వుందో.. అన్న చిన్న ఆశ తప్ప, జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర ప్రజానీకంలో ఏ మాత్రం ఉత్కంఠని సృష్టించలేకపోతున్నాయి.

Show comments