కొమ్మినేని: బాబూ.. ఇంత దిక్కుమాలిన రాజకీయమా!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాని, ఆయన మంత్రివర్గ సభ్యులు  కాని ఏ మాత్రం నిజాయితీ ఉన్నా ఇప్పుడు మాట్లాడాలి. వారు నిస్సిగ్గుగా చేసిన మతిలేని ఆరోపణలకు వారు జవాబు చెప్పుకోవాలి. రాజకీయాలలో కనీసం ఇంగితం ఉండాలి. విలువలను వదలి వారు చేసిన వికత విన్యాసాలకు ఇప్పుడు జవాబు దొరికింది. కేంద్ర ప్రభుత్వం ఆదాయ వెల్లడి పథకం ప్రకటించినప్పుడు కొంతమంది అందులో తమ వద్ద ఉన్న లెక్కలలోని సొమ్ము అనండి.. నల్లధనం అనండి ప్రకటించి నలభై ఐదుశాతం పన్ను కట్టడానికి సిద్దం అయ్యారు. సుమారు అరవై ఐదు వేలకోట్ల రూపాయలు వచ్చినట్లు కేంద్రం ప్రకటించింది. 

దాంతో దాదాపు పాతికవేల కోట్ల రూపాయలు బోగస్ అన్నట్లు ఇప్పుడు వెల్లడవుతోంది. అందులో భాగంగా ఒక పదివేల కోట్ల రూపాయల మొత్తాన్ని ఒక వ్యక్తి ఆదాయపన్ను శాఖకు తన ఆదాయంగా తెలియచేశాడు. నిజానికి స్కీమ్‌లో ఆదాయం ప్రకటించినవారి వివరాలు గాని, మొత్తాలు కాని అత్యంత రహస్యం అని కేంద్రం ప్రకటించింది. కాని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రం ఆ రహస్యం ఎలా తెలిసిందో ఆశ్చర్యం కలిగించే విషయమే. ఆదాయపన్ను శాఖకు సంబందించిన వారు ఎవరైనా తన వద్ద పనిచేస్తున్నారో, లేక మరెవరి ద్వారా తెలుసుకున్నారో కాని ఆయనకు  ఉప్పు అందింది. 

దానిని ఆయన తన రాజకీయ ప్రయోజనం కోసం వాడాలని అనుకున్నారు. ప్రభుత్వ బాధ్యతలలో ఉన్నా, ఏ మాత్రం పద్ధతి కాదని తెలిసినా, విలువలతో కూడిన విషయం కాకపోయినా, చంద్రబాబు హైదరాబాద్‌లో ఒక వ్యక్తి పదివేల కోట్ల రూపాయల ఆదాయం ప్రకటించారని, ఎవరై ఉంటారని, అంటూ రకరకాల క్లూలు ఇవ్వడానికి ప్రయత్నించారు. కేంద్రంలో మిత్రపక్షమైన బీజేపీ ఉండడంతో, అందులోను ఆయనకు అండగా ప్రదాని మోడీ, ఆర్దికమంత్రి అరుణ్ జైట్లీ, మరో మంత్రి వెంకయ్య నాయుడుల మద్దతు ఉండగా, ఆయనను ఎవరు ప్రశ్నించగలరు. 

ఓటుకు నోటు కేసులోనే అధికార వ్యవస్థ కాని, న్యాయ వ్యవస్థ కాని ఆయన జోలికి రావాలంటేనే వెనుకాడే పరిస్థితి ఉన్నప్పుడు ఇలాంటి సమాచారం బయటపెడితే మాత్రం ఆయనను ఎవరు ప్రశ్నించగలరు. అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత ఆయన సొంత మనుషులుగా ఉన్న మంత్రి దేవినేని ఉమ, తదితరులు ఏకంగా ఆ పదివేల రూపాయలు విపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ దేనని కనిపెట్టేశారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడారు. రాజకీయాలలో ఎంత నీచంగా వ్యవహరించాలో అలా చేశారు. వెంటనే స్పందించిన జగన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. 

పదివేల గొడవపై విచారణ చేయాలని కోరారు. కాని కేంద్రం పట్టించుకోలేదు. తద్వారా నీచ రాజకీయాలు చేసినవారికి కేంద్రం కూడా అండగా నిలబడినట్లు అయింది. తీరా ఇప్పుడు ఆ పదివేల కోట్ల వ్యవహారం బయటపడింది. ఆదాయపన్ను శాఖే ఏకంగా ఆ వ్యక్తి పేరు లక్ష్మణరావు అని, అతని వద్ద అంత డబ్బే లేదని తేల్చింది. ఈ అధికారిక ప్రకటన వచ్చాక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయ జీవితం అంతా ఇలాంటి మోసాలు, నీచాలతో, అబద్దాలతో సాగిందని విమర్శించారు. ఇప్పుడు దానికి చంద్రబాబు ఏమని సమాధానం చెబుతారు? 

తాను చాలా విలువలతో ఉంటానని, నీతిమంతుడనని ప్రజలు అనుకోవాలని ప్రయత్నించే చంద్రబాబు అసలు స్వరూపం ఇదా అని విపక్షం అడుగుతుంటే చంద్రబాబు కాని, ఆయన మంత్రులు కాని మొహం ఎత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఏదో వదంతి సష్టించి విపక్ష నేతను అప్రతిష్ట పాలు చేయాలన్న కుట్రలు ఎప్పుడూ ఫలిస్తాయని అనుకోవడం పొరపాటు. అరవైఆరేళ్ల వయసులో చంద్రబాబుకు ఇంకా కుట్ర రాజకీయాలు చేయాలా అని విపక్షాలు అడుగుతున్నాయి. అది ఆయన స్వభావం, సొంత మామ ఎన్‌టీఆర్‌కే ఆయన కుట్ర రాజకీయాలు తప్పలేదని... ప్రత్యర్ధులు చేసే విమర్శలకు మరింత ఊతం ఇచ్చేలా చంద్రబాబు ఇలాంటి రాజకీయాలు చేయడం ఏ మాత్రం విలువలతో కూడినవి కావని చెప్పాలి. 

ఎన్నాళ్లు రాజకీయం చేశాం.. ఎంతకాలం ముఖ్యమంత్రిగా ఉన్నాం.. అన్నది ముఖ్యం కాదు. ఎంత నీతివంతంగా, విలువలతో ఉన్నాం అన్నది ముఖ్యం. చంద్రబాబు తీరే అద్వాన్నంగా ఉందనుకుంటే ఆయన మంత్రులు, ఇతర నేతల పరిస్థితి మరీ అసహ్యంగా ఉంటోంది. తెలుగుదేశం పార్టీ విలువలను వదలివేసి బురదలో మునుగుతూ ఎదుటివారికి కూడా బురద అంటించాలన్న తాపత్రయంతో ఉండడం దురదష్టకరం. ఇకపైన అయినా ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలు మానుకుంటే మంచిది.

కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్

Show comments