క్యాష్‌లెస్‌.. కార్డ్‌ లెస్‌.. తుగ్లక్‌ జమానా.!

చేతిలో క్యాష్‌ లేకపోతేనేం, కార్డు గీకేద్దామనుకుంటున్నారా.? ఇప్పటికే కార్డుతో గీకుడుకు సంబంధించి చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. వున్నపళంగా పెద్ద పాత నోట్లను రద్దు చేయడంతో చాలామంది ప్లాస్టిక్‌ మనీ వైపు మళ్ళారు. దాంతో బ్యాంకుల సర్వర్లు మొరాయించాయి. నవంబర్‌ 9 తర్వాత చాలామంది కార్డు వినియోగదారులకు ఇది అనుభవమే. కార్డులు అక్కడే ఇచ్చేసి వచ్చేయడం, లేదంటే ఫోన్‌ నెంబర్‌, ఇతర గుర్తింపు కార్డులు వుంచేసి రావడం.. ఇలా నానా తంటాలూ పడ్డారు జనం. 

ఇప్పుడు పెట్రోల్‌ బంకుల్లో కార్డుతో లావాదేవీలకు బ్రేక్‌ పడ్తోంది. నిజానికి కేంద్రం, పెట్రోల్‌ బంకుల్లో కార్డులతో చేసే లావాదేవీలపై రాయితీ ప్రకటించింది. ఆ రాయితీని కేంద్రం భరించాల్సి వుండగా, అది కాస్తా డీలర్ల నెత్తిన మోపేసింది. ఇంకేముంది, డీలర్లు ఆందోళన షురూ చేశారు. అద్గదీ అసలు విషయం. ఇప్పటికి ఇది పెట్రోల్‌ బంకులకే పరిమితం. ముందు ముందు, మిగతా చోట్ల కూడా కార్డు వినియోగదారులకు ఈ పరిస్థితే ఎదురుకానుంది. 

అన్నట్టు, చాలా చోట్ల కార్డులతో లావాదేవీలకు అదనంగా 2 శాతం వసూలు చేస్తున్నారు. 'కార్డుతో లావాదేవీ అంటే 2 శాతం అదనపు ఛార్జీ పడ్తుంది.. లేదంటే క్యాష్‌ ఇచ్చి వెళ్ళండి..' అంటూ నిర్మొహమాటంగా కొన్ని చోట్ల వ్యాపార సంస్థల నుంచి వినియోగదారులకు సమాధానం వస్తుండడంతో, పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. 

ఇదిలా వుంటే, రెస్టారెంట్లలో సర్వీస్‌ ఛార్జ్‌ విషయంలోనూ తీవ్ర గందరగోళం నెలకొంది. 'అది మీ ఇష్టం' అని కేంద్రం తేల్చేసిందిగానీ, రెస్టారెంట్లేమో ససేమిరా సర్వీస్‌ ఛార్జ్‌ చెల్లించాల్సిందేనని తెగేసి చెబుతుండడం గమనార్హం. మోడీ పరిపాలన అంటే తుగ్లక్‌ జమానా.. అనే స్థాయికి పరిస్థితులు దిగజారిపోయాయి. ఇప్పుడిప్పుడే మార్కెట్‌లోకా కాస్త 'కరెన్సీ ఎవైలబిలిటీ' పెరగడంతో పరిస్థితి కొంచెం బెటర్‌గా వుందని సంతోషించాలో.. ముందు క్యాష్‌ లెస్‌ అనేసి, ఇప్పుడు కార్డ్‌ లెస్‌ కూడా.. అనేస్తోంటే, దిక్కు తోచక బిక్క మొహం వేయాలో తెలియని పరిస్థితి సామాన్యుడిది.

Show comments