నాగ్‌.. ఫిబ్రవరి సంచలనమవుతాడా.?

2017.. తెలుగు సినీ పరిశ్రమకు వెరీ వెరీ స్పెషల్‌ ఇయర్‌. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన రెండు పెద్ద సినిమాలు పెద్ద విజయాలు సాధించడమే అందుక్కారణం. తొమ్మిదేళ్ళ తర్వాత చిరంజీవి హీరోగా వచ్చిన 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా వసూళ్ళ పరంగా వంద కోట్ల క్లబ్‌లో చేరిన విషయం విదితమే. మరోపక్క, చారిత్రక అంశాల నేపథ్యంలో రూపొందిన బాలకృష్ణ సినిమా 'గౌతమి పుత్ర శాతకర్ణి' కూడా మంచి విజయాన్నే అందుకుంది. బాలయ్య కెరీర్‌లోనే హయ్యస్ట్‌ వసూళ్ళు ఈ చిత్రం సాధించింది. అఫ్‌కోర్స్‌, చిన్న సినిమానే అయినా 'శతమానం భవతి' పెద్ద విజయాన్నే అందుకుందనుకోండి.. అది వేరే విషయం. 

ఇక, ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో ఆల్రెడీ నాని 'నేను లోకల్‌' సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. రేపు, మరో స్టార్‌ హీరో నాగార్జున తన తాజా చిత్రం 'ఓం నమో వెంకటేశాయ'తో ప్రేక్షకుల ముందుకొస్తుండడంతో, ఫిబ్రవరిలో నాగార్జున వసూళ్ళ ప్రభంజనం సృష్టించడం ఖాయమన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. 'అన్నమయ్య' తర్వాత కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామికి సంబంధించిన కథతో నాగార్జున చేస్తున్న సినిమా ఇది. ఇదొక ఆధ్మాత్మిక అద్భుతమవుతుందని నాగార్జున ధీమాగా చెబుతున్నాడు. అంతే కాదు, తన కెరీర్‌లోనే ది బెస్ట్‌ ఫిలిం.. అంటూ ప్రకటించేయడం గమనార్హం. 

మిగతా ఈక్వేషన్స్‌ సంగతెలా వున్నా, టాలీవుడ్‌లో 'ఆ నలుగురు' అనదగ్గర చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌.. గ్యాంగ్‌లో చిరంజీవి, బాలకృష్ణ ఆల్రెడీ బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపేశారు. ఇక మిగిలింది నాగార్జున, వెంకటేష్‌. నాగార్జున రేపే తన సత్తా ఏంటో చాటి చెప్పనున్నాడు. 'గురు' మాత్రం కాస్త ఆలస్యమయ్యింది. ఈపాటికే వచ్చేయాల్సిన 'గురు' ఆలస్యమవుతుండడం వెంకీ అభిమానుల్ని కాస్తంత ఇబ్బందిపెడుతున్న మాట వాస్తవం. 

ఏదిఏమైనా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'ఓం నమో వెంకటేశాయ' సంచలన విజయం సాధించాలని ఆశిద్దాం.

Readmore!

Show comments