అమరావతి నిర్మాణం ప్రారంభమయినట్లేనా.?

అమరావతి.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని మాత్రమే కాదు, అది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం కూడా. రెండేళ్ళు పూర్తయ్యింది.. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని లేదు. ఉమ్మడి రాజధాని హైద్రాబాద్‌ నుంచి ముఖ్యమంత్రి తరలి వచ్చారు.. ఉద్యోగులూ తరలి వెళుతున్నారు.. వెళుతూనే వున్నారు. డెడ్‌లైన్‌ చూస్తే జూన్‌ 27. పరిపాలన కోసం తాత్కాలికంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్ని చంద్రబాబు సర్కార్‌ వినియోగించుకుంటోందిప్పుడు. 

ఇక, రాజధానికి సంబంధించి నేడు కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజధాని ప్రాంతం అమరావతిలో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆరు వరసలతో కూడిన అతి ముఖ్యమైన రోడ్డు మార్గమిది. ఇంకోపక్క, తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనుల్ని చంద్రబాబు స్వయంగా పరిశీలించారు. అఫ్‌కోర్స్‌.. ఇటీవలి కాలంలో తరచూ ఆయన తాత్కాలిక సచివాలయానికి వెళుతుండడం, పనులు వేగవంతంగా పూర్తి చేయాలని చెబుతుండడం జరుగుతూనే వుందనుకోండి.. అది వేరే విషయం. 

ముందుగా అనుకున్నదాని ప్రకారం జూన్‌ 2 నాటికి తాత్కాలిక సచివాలయం అందుబాటులోకి వచ్చెయ్యాలి. కానీ, అది కాస్తా జూన్‌ 27కి వెళ్ళింది. అయినప్పటికీ, ఇప్పటిదాకా తాత్కాలిక సచివాలయం అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు. మరోపక్క, వెలగపూడిలో ఎన్టీఆర్‌ క్యాంటీన్‌ని ఈ రోజు చంద్రబాబు ప్రారంభించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఇది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్‌ క్యాంటీన్లను నెలకొల్పి, తక్కువ ధరకే పేదల కడుపు నింపాలన్నది ఈ పథకం ఆలోచన. 

రాజధాని అమరావతిలో తొలి ఎన్టీఆర్‌ క్యాంటీన్‌ని ప్రారంభించడం అభినందనీయమే అయినా, రాజధానికి సంబంధించి ఏ పనీ ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం బాధాకరమే. ఉద్యోగులేమో హైద్రాబాద్‌ని వదిలి, అమరావతి బాట పట్టారు. వారికి, అక్కడ తాత్కాలికంగా కార్యాలయాల్ని ఏర్పాటు చేసినా, వారు నివాసం వుండేందుకు కొత్తగా సమస్యలు వచ్చిపడుతున్నాయి. కొందరు ఉద్యోగులు కుటుంబ సమేతంగా తరలి వెళితే, వయసు మీద పడ్డ ఉద్యోగులు కూడా అక్కడ హాస్టళ్ళు వెతుక్కోవాల్సిన పరిస్థితి. 

ఒక్కటి మాత్రం నిజం, విభజనతో ఆంధ్రప్రదేశ్‌ అత్యంత దారుణంగా నష్టపోయింది. ఆ నష్టంతో పోల్చితే, ఈ ఇబ్బందులు మరీ అంత కష్టమైనవి కాకపోయినప్పటికీ, రెండేళ్ళ నుంచీ తరలింపుపై పక్కాగా రోడ్‌ మ్యాప్‌ తయారుచేసుకుని వుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. తాత్కాలిక సచివాలయ నిర్మాణం అయినా, రాజధాని పరిధిలో రోడ్ల విషయంలో అయినా ఇప్పటిదాకా ఎలాంటి ప్రణాళికా లేకపోవడమే ఇన్ని సమస్యలకు కారణం. 

ఎలాగైతేనేం, సమస్యలను అధిగమించి.. అమరావతి నిర్మాణం దిశగా ముందడుగు పడితే అంతకన్నా కావాల్సిందేముంటుంది.? ముఖ్యమైన రోడ్లతోనే అమరావతి ప్రారంభమయ్యిందనుకోవడానికి వీల్లేదు. కేంద్రం నుంచి తగిన నిధులు రాలేదు, సింగపూర్‌ కంపెనీల నుంచీ పెట్టుబడులపై స్పష్టత లేదు. ప్రభుత్వం చెప్పే మాటలకీ, అమరావతిలో జరుగుతున్న పనులకీ పొంతన లేకపోవడంతో అమరావతిపై ఆశలు ఎన్ని వున్నా, ఆందోళన మాత్రం తగ్గడంలేదు.

Show comments