గెలుపులో ఏముంది కిక్కు.? ఒక్కసారి ఓడి చూడు, ఆ ఓటమిలో ఎంత కిక్కు వుంటుందో తెలుస్తుంది..! ఓటమిపాలైనవాడిలో కసి పెంచే మాట ఇది. కసిని పెంచడం మాట అటుంచితే, ఓటమితో కుంగిపోయేవారికి కొండంత ఆత్మస్థయిర్యాన్ని ఇస్తుంది. ఓటమి, గెలుపుకి తొలి మెట్టు.. అని కూడా చెబుతుంటాం. ఆట అన్నాక గెలుపోటములు సహజం. ఈ విషయం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కన్నా ఇంకెవరికి బాగా తెలుసు.?
క్రికెట్‌లో బహుశా సచిన్ చూసినన్ని ఎత్తుపల్లాలు ఇంకెవరూ చవిచూసి వుండరేమో. శారీరకంగా, మానసికంగా సచిన్ ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఆయన పట్టుదలముందు పటాపంచలైపోయాయి. అందుకే, దీపా కర్మాకర్‌ని ప్రశంసలతో ముంచెత్తేశాడు. జిమ్నాస్ట్ అయిన దీపా కర్మాకర్, ఒలింపిక్స్‌లో మెడల్ కొడుతుందని ముందుగా ఎవరూ అనుకోలేదు. కానీ, ఒలింపిక్స్‌లో సత్తా చాటింది. అద్భుతమైన విన్యాసాలతో క్రీడాభిమానులంతా ఔరా అనుకునేలా చేయగలిగింది.
గోల్డ్, సిల్వర్, బ్రాంజ్.. ఈ మెడల్స్ ఏవీ దీపా కర్మాకర్‌కి దక్కలేదు. కానీ, ఆమె ఇండియాలో హాట్ టాపిక్. 'దీపా ఎలాగైనా గెలవాలి..' అని వంద కోట్లకుపైగానే వున్న భారతీయులు మనసారా కోరుకున్నారు. ఆ కోరికలు ఫలించలేదు. అలాగని, దేశం ఏమీ ఆమెను, ద్వేషించలేదు. ఆమె మెడల్ సాధించేసిందన్నట్లుగానే కీర్తిస్తోంది భారతదేశం ఆమెను. ఇంతకన్నా ఆమెకు మద్దతు ఇంకెక్కడ దొరుకుతుంది.? అవును దీప గోల్డ్.. ఆమె గుండెల్ని కొల్లగొట్టింది. ఒలింపిక్స్‌కి సంబంధించి జిమ్నాస్టిక్స్‌లో సరికొత్త సంచలనాలకి తెరలేపింది. చాలామందికి మార్గదర్శకురాలిగా మారింది. కోట్లాది మంది గుండెల్లో చోటు సంపాదించుకోవడం కన్నా, గొప్ప పతకం ఇంకేముంటుంది.?