పవన్‌ ఆర్డర్‌.. టీడీపీ 'జీ హుజూర్‌'

జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్‌, పశ్చిమగోదావరి జిల్లాలో మెగా ఆక్వాఫుడ్‌ పార్క్‌ బాధితులకు మద్దతుగా ఈ రోజు మాట్లాడిన విషయం విదితమే. ఇలా పవన్‌కళ్యాణ్‌, బాధితులతో మాట్లాడారో లేదో, అలా టీడీపీ నుంచి రెస్పాన్స్‌ వచ్చేసింది. 'చిన్న చిన్న గ్రామాల్లో 144 సెక్షన్‌ ఏంటి.?' అంటూ పవన్‌ ప్రశ్నించడంతో, టీడీపీ నుంచి సమాధానమొచ్చింది. సాక్షాత్తూ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల రాజప్ప స్పందించారు. పవన్‌ సూచనల్ని పరిగణనలోకి తీసుకుంటాం.. 144 సెక్షన్‌ ఎత్తివేసే విషయాన్ని పరిశీలిస్తాం.. అని సెలవిచ్చారు. 

'అదిరిందయ్యా పవన్‌కళ్యాణ్‌.. మీరు ఆర్డరేస్తే.. అధికార పార్టీ జీ హుజూర్‌ అనేస్తోంది..' అన్పిస్తోంది కదా, కాస్త ఆగండీ, ఓ పక్క పవన్‌కళ్యాణ్‌ ప్రశ్నలపై టీడీపీ నేతలు కొందరు సానుకూలంగా స్పందిస్తే, ఇంకోపక్క మరికొందరు టీడీపీ నేతలు పవన్‌కళ్యాణ్‌కి ఘాటుగా సమాధానమిచ్చారు. మెగా ఆక్వా ఫుడ్‌పార్క్‌తో గోదావరి నది కాలుష్యం బారిన పడ్తుందని పవన్‌ ఆరోపించడాన్ని, టీడీపీ నేత రాజేంద్రప్రసాద్‌ తప్పుపట్టారు. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ నుంచి క్లీన్‌ చిట్‌ వచ్చిందనీ, ఆ ప్రాజెక్ట్‌తో ఎలాంటి కాలుష్యం వుండదని తేల్చి చెప్పారాయన. 

టీడీపీ అంటేనే రెండు నాలుకలు.. చంద్రబాబు తెలంగాణ విషయంలోనే కాదు, అన్ని విషయాల్లోనూ రెండు కళ్ళు.. రెండు నాల్కల సిద్ధాంతాన్నే పాటిస్తారు.. యధా అధినేత, తథా నాయకులు కదా.. అందుకే, పార్టీలోని నేతలు కూడా రెండు విధాలుగా స్పందిస్తున్నారట. ఏదో మాటవరసకి, 'కులాల కుంపట్లు..' అని పవన్‌కళ్యాణ్‌ తన వ్యాఖ్యల్లో ప్రస్తావిస్తే, కులాల్ని రెచ్చగొట్టడమంటే, దేశద్రోహమేనంటూ రాజేంద్రప్రసాద్‌ గుస్సా అయిపోయారు. 

ఏదో, తన వద్దకు వచ్చిన బాధితులకు సాంత్వన కల్గించేలా నాలుగు మాటలు చెప్పి ఊరుకున్నారు పవన్‌కళ్యాణ్‌, 'కాటమరాయుడు' సినిమా పనుల నుంచి కాస్త గ్యాప్‌ తీసుకుని. అంతేగానీ, ఆయనేమన్నా సీరియస్‌ పొలిటీషియనా.? జనంలోకి వెళ్ళి పోరాడేయడానికి. అంత ఓపిక, చిత్తశుద్ధి ఆయనకు లేవాయె. టీడీపీ నేతలు పరిశీలిస్తామని చెప్పినా, ఇంకొందరు టీడీపీ నేతలు పవన్‌కళ్యాణ్‌పై దుమ్మెత్తి పోసినా, ఇట్నుంచి పవన్‌ తరఫున కౌంటర్‌ ఇవ్వడానికి జనసేన అనే పార్టీ నుంచి నేతలెక్కడ.?

Show comments