'మగధీర' పరువు తీసేశారా.!

'మగధీర' సినిమాతో తమ సినిమాకి సంబంధం లేదని 'రాబ్తా' టీమ్‌ న్యాయస్థానంలో గట్టిగా వాదించింది.. 'కాపీ' కేసులో గెలిచింది కూడా. కాదు కాదు, 'కోర్టు బయట సెటిల్‌మెంట్‌తో వివాదం సద్దుమణిగింది..' అనే వాదనలూ లేకపోలేదు. ఏది నిజం.? అన్నది వేరే విషయం. కానీ, ఈ మొత్తం ఎపిసోడ్‌లో 'మగధీర' సినిమా అభాసుపాలయ్యింది. నిజమే మరి, 'రాబ్తా' సినిమా విషయంలో 'మగధీర' సినిమాని అభాసుపాల్జేశారంటూ బాలీవుడ్‌ సినీ పండితులే చెబుతున్నారు. 

విషయమేంటంటే, 'రాబ్తా' సినిమాకి చాలా బ్యాడ్‌ టాక్‌ వచ్చింది బాలీవుడ్‌లో. 'ఇంత చెత్త సినిమా ఇటీవలి కాలంలో చూడలేదు..' అంటూ కొందరు బాలీవుడ్‌ సినీ విశ్లేషకులు సోషల్‌ మీడియాలో 'మినీ రివ్యూలతో' ఏకి పారేశారు. 'రాబ్తా' సంగతి పక్కన పెడితే, ఇంత చెత్త సినిమాతో తమ సినిమా 'మగధీర'ని పోల్చడం ద్వారా 'మగధీర' చిత్ర నిర్మాతలు తమ స్థాయి తగ్గించుకున్నారంటూ వాళ్ళే కామెంట్స్‌ పోస్ట్‌ చేస్తుండడం గమనార్హం. 

ట్రైలర్‌ విడుదలయ్యాక, 'కాపీ' ఆరోపణలొచ్చాక, 'మగధీర' టీమ్‌ స్పందించింది. అలా స్పందించడం తప్పెలా అవుతుంది.? 'రాబ్తా' సినిమాని ఏకిపారెయ్యడానికి, 'మగధీర' పరువు తీసేశారనడం ఎంతవరకు సబబో మరి.! 'మగధీర' సినిమాని కాపీ కొట్టేసి, ఆ సంగతి తెలియకుండా మేనేజ్‌ చేయడానికి చిత్ర దర్శక నిర్మాతలు పడ్డ పాట్లు సినిమా అంతటా కన్పించాయనీ, అదే ఒరిజినల్‌ కథని తీసుకుంటే ఇంత చెత్త సినిమా వచ్చేది కాదని 'రివ్యూలు' వచ్చాయంటే 'మగధీర'కు 'రాబ్తా' కాపీ కాదని ఎలా అనుకోగలం.?

Show comments