కొమ్మినేని: టీడీపీ డబుల్ గేమ్‌కు చెక్ పెట్టిన బీజేపీ

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం నో అని చెప్పేయడం ఒక ఎత్తు అయితే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దానికి చేతులు ఎత్తివేయడం మరో ఎత్తుగా ఉంది. ఏపీలో బీజేపీ ఎదుగుదలను విజయవంతంగా అడ్డుకున్న చంద్రబాబు నాయుడు ఈసారి మాత్రం బీజేపీ వ్యూహానికి తలొగ్గక తప్పలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లి ప్రత్యేక సాయం చేస్తామని ప్రకటన చేసిన సందర్భంగా చంద్రబాబు తనతో పాటు ఉండాలని కోరుకున్నారు. ఆయన వెళ్లకుండా తప్పుకున్నారు  కాని, తన సన్నిహిత కేంద్రమంత్రి సుజనా చౌదరిని బీజేపీ మంత్రులు జైట్లి, వెంకయ్య నాయుడుల సరసన కూర్చోబెట్టారు. 

అలాగే జైట్లి ప్రకటన తర్వాత స్వాగతిస్తున్నట్లు చంద్రబాబు చెప్పవలసిన పరిస్థితిని బీజేపీ సృష్టించింది. నిజానికి మరో రెండు, మూడు రోజులు ఈ తతంగం నడుస్తుందని అనుకున్నారు. కాని బీజేపీ దీనిపై ఎదో ఒకటి తేల్చేయాలని అనుకున్నట్లుగా ఉంది. ప్రత్యేక సాయం పేరుతో  తన ప్రతిపాదనను చెప్పి, దానిని చంద్రబాబు ఒప్పించేలా చేయగలిగింది. సాధారణంగా అయితే కేంద్రం ప్రకటన చేయడం, ఆ తర్వాత దానితో తనకు సంబంధం లేదన్నట్లుగా చంద్రబాబు మాట్లాడడం, బీజేపీపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు లీక్‌లు ఇవ్వడం లేదా, తనే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చెప్పడం చేసే ఆయన ఈసారి ఒక రకంగా చెప్పాలంటే గుక్క తిప్పుకోలేకపోయారని అనుకోవాలి. 

తెలుగుదేశం డబుల్ గేమ్‌కు ప్రతిగానే బీజేపీ ఈ పనిచేసినట్లు కనిపిస్తుంది. చంద్రబాబుకు సన్నిహితుడైన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడ ఈ విషయంలో ఏమీ చేయలేకపోయి ఉండాలి. దాంతో చంద్రబాబు ప్యాకేజీకి స్వాగతిస్తున్నట్లు చెప్పక తప్పలేదు. ఇంతకాలం కేంద్రంపై రాజీలేని పోరాటం చేస్తామని, ప్రత్యేక హోదా ఏపీకి జీవన్మరణ సమస్య అని పలు బహిరంగ సభలలో చెబుతూ వచ్చిన చంద్రబాబు కాని, తెలుగుదేశం నేతలు కాని మూడు, నాలుగు రోజుల కిందటే కొత్త పల్లవి అందుకున్నారు. ప్యాకేజీతో పాటు హోదా కూడా కోరుతున్నామని, ముందుగా ప్యాకేజీ తీసుకుంటామని చెప్పడం ఆరంభించారు. దానికి తగినట్లుగా స్క్రిప్ట్ తయారు చేసుకున్నారు. 

కాకపోతే ఈ సారి బీజేపీ వేసిన గేమ్ ప్లాన్‌లో చంద్రబాబు కాని, తెలుగుదేశం కాని చిక్కుకోక తప్పలేదు. కేంద్రం ఒత్తిడి చేసిందా? లేక ఇతరత్రా ఇబ్బందులు వస్తాయని అనుకున్నారా? లేక ఓటుకు నోటు కేసులో ఇరుకున పడవలసి వస్తుందని భావించారా అన్న సంగతి తెలియదుకాని చంద్రబాబు ఈసారి బీజేపీకి భయపడినట్లే కనిపిస్తుంది. మరో ప్రత్యేకత ఏమిటంటే కేంద్రంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్న అశోక్ గజపతి రాజుకు ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా సహాయ మంత్రి అయిన సుజనా చౌదరి ద్వారానే ఈ కథ నడపడం పలు చర్చలకు దారి తీసింది. 

ఈ రాజకీయాలు ఈ విధంగా కొనసాగుతుంటే ప్రత్యేక హోదాపై ఐదు కోట్ల మంది పెట్టుకున్న ఆశల మీద బీజేపీ, టీడీపీలు నీళ్లు చల్లాయని, విపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ బంద్‌కు పిలుపు ఇచ్చారు. ప్రజలలో దీనిపై ఎంతో ఆశ ఉన్న మాట నిజమే. అప్పట్లో  ప్రధాని మోదీ హామీ ఇవ్వడం కాని, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పదేళ్లు ఇస్తామని చెప్పడం కాని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదిహేను సంవత్సరాలు ఇవ్వాలని కోరడంకాని, పవన్ కళ్యాణ్ వారికి మద్దతు ఇవ్వడం కాని ప్రజలలో ఒక విశ్వాసం ఇచ్చాయి. కాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ పెట్టి బీజేపీ, టీడీపీలతో సంబంధం లేదన్నట్లుగా కనిపించడానికి యత్నిస్తున్నారు. ఆయన ఎంతవరకు నిలదీస్తారో తెలియదు. 

నిజంగానే జైట్లి చేసిన ప్రకటనలో నిర్దిష్టంగా ఏమీ కనిపించలేదు. విదేశీ ఆర్థికసాయంతో జరిగే ప్రాజెక్టులలో రాష్ర్టం భరించే ముప్పైశాతం కూడా కేంద్రమే భరిస్తుందని చెప్పారు. కాని ఆ ప్రాజెక్టులు ఎన్ని గ్రౌండ్ అవుతాయో తెలియదు. అలాగే కోస్తా కారిడార్ పరిశ్రమల అభివృద్ధికి సాయం చేస్తామన్నారు. దీర్ఘకాలంలో ఇది కొంత ప్రయోజనం ఉండవచ్చు. పోలవరం ప్రాజెక్టుకు కొత్తగా వీరు చెప్పింది ఏమీలేదు. పైగా రాష్ర్టం ఆసక్తితో ఉంది కనుక కాంట్రాక్ట్ పర్యవేక్షణ వారికి అప్పగిస్తామని జైట్లి ప్రకటించడం ప్రమాదకరంగా కనిపిస్తుంది. 

ఇప్పటికే పట్టిసీమ  కోసం పెట్టిన ఖర్చును పోలవరంలో కలిపి వివాదం చేసిన రాష్ర్ట ప్రభుత్వం దానిని ప్రచారానికి వాడుకుంటోందే కాని, ఒక్క అడుగు ముందుకు వేసినట్లు కనిపించలేదు. ఈ దశలో మొత్తం ప్రాజెక్టు అప్పగిస్తే దాని పరిస్థితి ఏమవుతుందో తెలియదు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి అసలు ఏమీ ఇవ్వలేదని కూడా అనలేం. ఒక రాష్ట్రానికి సుమారు తొమ్మిదివేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేయడం తక్కువేమీ కాదు. కాని తెలుగుదేశం పార్టీ కాని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాని ఆ నిధులన్నిటిని తమ ప్రచార ఖాతాలో వేసుకుని బీజేపీ ఏమీ చేయడం లేదని, కేంద్రం ఇవ్వకపోయినా తాము కష్టపడి అభివృద్ధి చేస్తున్నామని చెబుతూ బీజేపీని దెబ్బకొడుతూ వచ్చారు. 

దానిని కేంద్ర మంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు లాంటి వారు ఆదిలోనే ఖండించి ఉంటే బీజేపీ ఇంతగా అప్రతిష్టపాలయ్యేది కాదు. ఈ నేపధ్యంలో ప్రత్యేక హోదా అంశంలో రెండు పార్టీలు కలిసి ఈ రెండేళ్లుగా డ్రామా ఆడాయన్న భావన ప్రజలలో రావడానికి ఆస్కారం ఏర్పడింది. అందుకే రాజకీయాలలో డ్రామాలు ఎళ్లవేళలా పనిచేయవని గుర్తించాలి. ఆ డ్రామాల ఊబిలో ఈ రెండుపార్టీలు చిక్కుకుని, ఆంధ్రుల ఆత్మగౌరవానికి చిహ్నంగా మారిన ప్రత్యేక హోదా అంశం ఆ పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని భావించాలి.

కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్

Show comments