అందుకే అనుష్క వెరీ వెరీ స్పెషల్‌

'అరుంధతి' లాంటి అవకాశమొస్తే ఎవరూ వదులుకోరు.. అదే, 'సైజ్‌ జీరో' లాంటి సినిమా చెయ్యాలంటే.? ఎవరూ ఒప్పుకోరు. 'బాహుబలి' సినిమాలో ఛాన్స్‌ అన్నా అంత తేలిగ్గా ఒప్పుకోరెవరూ. ఎందుకంటే, ఆ సినిమాలో అనుష్క పాత్ర అలాంటిది. 'దేవసేన' పాత్ర గురించి గొప్పగా చెప్పుకుంటున్నా, అనుష్క డీ గ్లామర్‌ లుక్‌తో కన్పించడమే కాదు, 'బాహుబలి ది బిగినింగ్‌'లో అనుష్క పాత్రకి అసలు ప్రాధాన్యమే లేదు. 

మరెందుకు, అనుష్క 'దేవసేన' పాత్ర కోసం ఒప్పుకున్నట్టు.? ఇదే ప్రశ్న అనుష్క ముందుంచితే, ''గ్లామరస్‌ పాత్ర చేస్తున్నాననిగానీ, డీ గ్లామరస్‌ పాత్ర చేస్తున్నాననిగానీ అలాంటి ఆలోచనలు ఎప్పుడూ చేయలేదు. రాజమౌళి చెప్పగానే ఓకే చెప్పేశాను. సినిమా అలా అలా చేసుకుంటూ వెళ్ళిపోయాం. నటిస్తూనే వున్నాను కాబట్టి, తేడా తెలియలేదు నాకు. అసలు ఆ పాత్రకి ఎందుకు ఒప్పుకున్నానో రాబోయే 'బాహుబలి ది కంక్లూజన్‌' చూస్తే అర్థమవుతుంది..'' అని సమాధానమిచ్చిందామె. 

ఇక, ఇలాంటి సినిమాల్లో ఏమీ లేకుండా అంతా ఊహించుకుని చెయ్యాల్సి వుంటుంది కదా.? అన్న ప్రశ్నకు సమాధానమిచ్చిన అనుష్క, 'ఏ సినిమా చేసినా అంతే. ఒక్కోసారి కెమెరా చూస్తూ అక్కడ హీరో వున్నట్లు ఊహించుకుంటాం. ఇందులో ఇంకాస్త ఎక్కువ అంతే. ఒకింత ఎక్కువ కష్టపడాల్సి వచ్చిందంతే..' అని చెప్పింది. 

'బాహుబలి ది కంక్లూజన్‌' విడుదలకు ముహూర్తం దగ్గర పడ్తున్న దరిమిలా, సినిమా ప్రమోషన్‌ని పీక్స్‌కి తీసుకెళుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్‌, అనుష్క మీడియా ముందుకొచ్చారు. 'సైజ్‌ జీరో' కోసం బాగా లావయిపోయిన అనుష్క మల్ళీ ఇప్పుడు కాస్త నాజూగ్గానే కన్పిస్తోంది. అయినా, మునుపటి గ్లామర్‌ మాత్రం అనుష్కలో అస్సలు తగ్గలేదు. అదే సింప్లిసిటీ.. అదే క్యూట్ నెస్.. అదే స్వీట్ నెస్.. అందుకే అనుష్క వెరీ వెరీ స్పెషల్.

Show comments