ఆయన ‘జనసేన’ లో చేరుతున్నాడు, జోకా..?!

కొత్త ఒక మాట వినిపిస్తోంది. అదేమనగా.. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ‘జనసేన’ లో చేరతాడు అనేది! ప్రస్తుతానికి రాజకీయంగా క్రాస్ రోడ్స్ లో ఉన్న కిరణ్ మళ్లీ రాజకీయంగా చలనశీలతను కోరుకుంటున్నాడు. తను ఏదో ఒక పార్టీలో చేరడం ఖాయమే అని ఈ మధ్య నే క్లారిటీ కూడా ఇచ్చాడు. అయితే ఏ పార్టీనో చెప్పలేదాయన. మరి మాజీ ముఖ్యమంత్రి అంటే ఆయనకో విధానం, రాజకీయ వ్యక్తిత్వం, వ్యూహం ఉంటుంది.. కాబట్టి ఆయన పలానా పార్టీలోకి చేరే అవకాశం ఉంటుందని ఒక అభిప్రాయానికి రావొచ్చు.

కానీ జాక్ పాట్ గా సీఎం అయిన కిరణ్ కు అలాంటివి ఏమీ లేవు! ఆయన ఏ పార్టీలో అయినా చేరగలడు. కాబట్టి.. ‘జనసేన’ వీరాభిమానులు కిరణ్ ను వాడుకుంటున్నారు. కిరణ్ తమ పార్టీలోకి చేరనున్నాడని అంటున్నారు. జెండా తప్ప అజెండా ఏమిటో ఎవరికీ తెలీని పార్టీలోకి కిరణ్ చేరతాడు అనే ప్రచారాన్ని అయితే బాగానే చేస్తున్నారు. 

కిరణ్ చేరతాడు అనేది జనసేన అభిమానులకు ఉత్సాహాన్ని ఇచ్చే అంశమే! ఈ ఉత్సాహంతో వీళ్లు అప్పుడే కిరణ్ ను హీరో అనేస్తున్నారు. సమైక్యాంధ్ర కోసం పోరాడాడు అని.. ఈ ఇలాంటి వీరాధి వీరుడు తమ పవన్ కు తోడయితే ఇక తిరుగేలేదని అనేస్తున్నారు. ముఖ్యమంత్రి గా మూడేళ్ల పై కాలం ఉండి, సొంత నియోజకవర్గంలో తమ్ముడిని గెలిపించుకోలేని ఈ రెడ్డిగారిని అద్వితీయ శక్తి అని వర్ణిస్తున్నారు. పవన్ తో కిరణ్ కూడిక సంచలనం అంటున్నారు!
కిరణ్ పై వీరికి వెళ్లువెత్తుతున్న ఈ అభిమానం అంతా ఆయన ‘జనసేన’ లో చేరతాడనే రూమర్ వల్లనే. మరి ఈ రూమర్ నిజం కావొచ్చు, కేవలం ఉత్తుత్తి ప్రచారం కావొచ్చు.  

గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ‘మాజీ ముఖ్యమంత్రి’  ఈ హోదా కలిగిన ఏ వ్యక్తి అయినా తెలుగుదేశంలోనో, వైకాపాలోనో పొందలేడు. ఎందుకంటే.. ఆ పార్టీల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులున్నారు. పార్టీ సుప్రిమోలున్నారు. వారి కింద ద్వితీయ స్థాయి నేతగా ఒక ‘మాజీ ముఖ్యమంత్రి’ చలామణి కాలేడు. జాక్ పాట్ గా సీఎం పదవి దక్కినప్పటికీ, ‘మాజీ ముఖ్యమంత్రి’ హోదా కిరణ్ నే కాదు.. ఎవరినీ అలా ఉండనివ్వదు! ఒక ప్రాంతీయ పార్టీలో దాని సుప్రిమో కు సలాములు కొడుతూ బతకనివ్వదు. 

ఇలాంటి వారికి జాతీయ పార్టీలు తగిన వేదికలు అవుతాయి. నేషనల్ పార్టీల్లో అయితే.. అంతా లీడర్లే, అంతా ముఖ్యమంత్రి పదవికి తగిన వ్యక్తులే.. రాష్ట్ర స్థాయిలో పార్టీ ప్రెసిడెంట్ ఉన్నా వారి దారి వారిదే, వీళ్ల దారిది వీళ్లదే! ఈ లెక్క ప్రకారం చూస్తే, కిరణ్ బీజేపీ లో చేరాలి.. లేదా తన మాతృపార్టీ కాంగ్రెస్ లో చేరాలి. తెలుగుదేశంలో కానీ, వైకాపాలో కానీ చేరే అవకాశాలుండవు.

తెలుగుదేశం, వైకాపాల్లో కాదు కానీ.. ‘జనసేన’ లో చేరతాడనే రూమర్ మాత్రం వినిపిస్తోంది. ఇంత వరకూ జనసేన సభల్లో పవన్ తప్ప వేదిక మీద మరెవరికీ స్థానం దక్కలేదు. ఇప్పుడు కిరణ్ కు ఆ అవకాశం దక్కుతుందా? కిరణ్ గొప్పదనం గురించి వివరిస్తూ పవన్ ఏదైనా థియరీ చెబుతాడా? పార్టీలో తన తర్వాత కిరణే నంబర్ టూ అని ప్రకటించబోతున్నాడా? తాడూ బొంగరం లేని పార్టీలో నంబర్ టూ హోదాతో కిరణ్ సంతృప్తి చెందుతాడా? పవన్ తో కలిసి పార్టీని బలోపేతం చేయడానికి పని మొదలుపెడతాడా? ఆల్రెడీ ఒక పార్టీని ఏర్పాటు చేసి, ఎక్కడా డిపాజిట్ దక్కించుకోలేని ఈ మాజీ ముఖ్యమంత్రికి నిజంగానే ఒక పార్టీని బలోపేతం చేసేంత సీన్ ఉందా?! అసలు జనసేనలోకి కిరణ్ చేరిక అనేది ఎవరో ఖాళీగా ఉండే వాళ్లు సృష్టించిన  పుకారా? వేచి చూడాలి! 

Show comments