ప్చ్‌.. జల్లికట్టూ లేదు.. కోడి పందాలూ లేవు.!

తమిళనాడుకి జల్లికట్టు ఝలక్‌.. తెలుగు రాష్ట్రాలకు కోడి పందాల ఝలక్‌. ఈ రెండూ ఇప్పుడు మూడు రాష్ట్రాలకీ సంక్రాంతి సంబరాల్ని దూరం చేసేశాయి. సుప్రీంకోర్టులో జల్లికట్టుకి షాక్‌ తగిలితే, హైకోర్టు కోడి పందాలకు 'రెడ్‌ సిగ్నల్‌' వేసిన విషయం విదితమే. చాలాకాలంగా జల్లికట్టు వివాదం నడుస్తోంది. సేమ్‌ టు సేమ్‌ కోడి పందాలు కూడా.! 

జల్లికట్టు విషయంలో తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలు ఒకే మాట మీద వున్నాయి. సంప్రదాయ క్రీడగా జల్లికట్టు వుండాలన్నదే వారి నినాదం. సినీ ప్రముఖులూ జల్లికట్టుకి మద్దతిచ్చేవారే. కోడి పందాల తీరు వేరు. పల్నాడు ప్రాంతంలో కోడి పందాల కారణంగా కక్షాకార్పణ్యాలు రేగిన చరిత్ర ఒకప్పుడు వుంది. అయితే, ఇప్పుడు కోడి పందాలకు కేరాఫ్‌ అడ్రస్‌ ఉభయ గోదావరి జిల్లాలు. కృష్ణా, గుంటూరు జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌ అంతటా కోడి పందాలు సంక్రాంతి స్పెషల్‌ అయిపోయాయి. తెలంగాణలోనూ కోడి పందాల జోరు కొనసాగుతోంది. చిత్రమైన విషయమేంటంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కోడి పందాలకు వ్యతిరేకం. కానీ, కోడి పందాలు జరుగుతూనే వుంటాయి. అదే చిత్రం. 

తమిళనాడులో సుప్రీం ఆదేశాల నేపథ్యంలో జల్లికట్టు జరగదా.? అంటే, చాటుమాటుగా జరిగిపోద్దంతే. తెలుగు రాష్ట్రాల్లో కోడి పందాలు జరగవా.? అంటే, ఎందుకు జరగవూ.. చాటుమాటుగా కాదు, బాహాటంగానే జరిగిపోతాయని చెప్పక తప్పదు. ఉభయ గోదావరి జిల్లాల్లో అయితే, అధికారంలో వున్నవారికి అత్యంత ప్రతిష్టాత్మకం కోడి పందాలు. పైకి చెప్పే మాటలెలా వున్నా, తెరవెనుక కోడి పందాలకు మద్దతివ్వాల్సిందే.. తెరవెనుక వాటిని తామే నిర్వహించి తీరాల్సిందే. లేదంటే తేడాలొచ్చేస్తాయ్‌. కోడి పందాలకు మద్దతివ్వనోడూ ఓ రాజకీయ నాయకుడేనా.? అని తేలిగ్గా తీసి పారేస్తారక్కడ. అదీ ఉభయగోదావరి జిల్లాల్లో కోడి పందాలకు వున్న ఫాలోయింగ్‌. కోడి పందాల కోసం పెద్ద పెద్ద మైదానాలు రెడీ అవుతాయి. ఎల్‌ఈడీ స్క్రీన్లు, స్వైపింగ్‌ మెషీన్లు, ఫ్లడ్‌ లైట్లు.. అబ్బో ఆ హంగామా అంతా ఇంతా కాదు.! 

మరి, ఈసారి ఏం జరుగుతుంది.? తమిళనాడులో జల్లికట్టుపై సుప్రీం మరోమారు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. కోడి పందాల విషయంలోనూ సుప్రీం ససేమిరా అనేసింది. దాంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో కోడి పందాలు - తమిళనాడులో జల్లికట్టు.. జరగవంటే జరగవంతే.. జరుగుతాయంటే, జరుగుతాయంతే.! నమ్మినోడికి నమ్మినంత.! ఆ ఆటల పండగ మాత్రం మామూలే.! Readmore!

Show comments