త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న సామి-2 సినిమాలో కీర్తిసురేష్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. నిజానికి ఈ సినిమాకు కాల్షీట్లు కేటాయించే పొజిషన్ లో కీర్తి సురేష్ లేదు. ఆమె కోసం విక్రమ్ తన కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేసుకోవాల్సి వచ్చింది. కీర్తి కోసం ఇంతలా సామి టీం వెయిట్ చేయడానికి కారణం ఒకటే. ఈ మూవీని తెలుగులో కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేయడమే.
సామి-2 సినిమాను ఒకేసారి తమిళ-తెలుగు భాషల్లో విడుదల చేయాలని అనుకుంటున్నారు. విక్రమ్ కు టాలీవుడ్ లో ఆల్రెడీ ఫాలోయింగ్ ఉంది. అయితే క్రేజ్ మాత్రం కాస్త తగ్గింది. అందుకే సామి-2కు తెలుగులో రీచ్ పెంచేందుకు ఇక్కడ ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న కీర్తి సురేష్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. ప్రస్తుతం ఈమె పవన్ కల్యాణ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కీర్తి రాకతో తెలుగులో కూడా ఈ ప్రాజెక్టుకు డిమాండ్ పెరిగింది.
మరోవైపు సామి-2 సినిమాకు తెలుగు టచ్ ఇచ్చేందుకు దేవిశ్రీని సంగీత దర్శకుడిగా తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఇలా సామి-2 సినిమా కోసం దర్శకుడు హరి చాలానే బ్యాక్-ఎండ్ వర్క్ చేస్తున్నాడు. అన్నట్టు సామి సినిమా తెలుగులో లక్ష్మీనరసింహగా రీమేక్ అయి సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే సామి-2ను భారీస్థాయిలో తెలుగులో కూడా తీసుకొస్తే, ఇక ఆ సినిమాకు రీమేక్ ఉండదేమో.