బాబు ఫైళ్లు తయారు చేయిస్తున్నారు

కుక్కను చంపాలంటే పిచ్చిది అని ముద్రవేయాలట. ఎవరైనా బుక్ చేయాలంటే ఓ ఫైల్ తయారు చేయాలంటారు. ఇదంతా రాజకీయం. అంతే. చంద్రబాబుకు మంత్రి వర్గ విస్తరణ అన్నది ఓ తలకాయనొప్పి. కొందర్ని తప్పించాల్సి వుంది. మరి కొందర్ని డిమోట్ చేయాల్సి వుంది. పదవి ఆశిస్తున్న వారికి బ్రేక్ లు వేయాల్సి వుంది. మరెలా? మరి ఎవరికైనా ఇది పెద్ద సమస్య..తలకాయనొప్పి. కానీ చంద్రబాబుకు కాదు. ఆయన చాణక్యం ఇంతా అంతా కాదు. అందుకే ఆయన వ్యూహాల అమలు ఆయన స్టార్ట్ చేసేసారు. 

తొలి వ్యూహం..ఎమ్మెల్యేల ప్లస్ మైనస్ ల రిపోర్టులు. మంత్రులు కాకపోయినా, ఏ ఎమ్మెల్యే ఎలా సంపాదించేసుకుంటున్నారు, వారి తరపున ఎవరు ఎక్కడ ఎలా పనులు చక్కబెట్టేస్తున్నారు ఇలాంటి సీక్రెట్ విషయాలు అన్నీ సేకరించి సీల్డ్ కవర్ లో ఎమ్మెల్యేలకు అందించేసారు. ఎవరి రిపోర్టు వారు చూసుకుని, ఖంగుతినడమో, కుమిలిపోవడమో తప్ప, పైకి చెప్పుకోలేని పరిస్థితి. నేరుగా బాబు దగ్గరకు వెళ్లి ముందు వాటిపై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. 

దానికి బాబు ఏమన్నారని వార్తలు వచ్చాయి? ' నేను మిమ్మల్ని ఏమీ అనలేదు కదా? ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. అలాంటి వ్యవహారాలకు చెక్ పెట్టండి..' అంటూ మెల్లగా చెప్పారట. సో ఆ విధంగా మీ వ్యవహారాలన్నీ నాకు తెలుసు అన్న సందేశాన్ని ఎమ్మెల్యేల్లోకి పంపించారు. 

తరువాత ఫేజ్ ఏమిటి? నిన్నటికి నిన్న ఒక్కరి కోసం పది ఎమ్మెల్యే సీట్లను పోగొట్టుకోలేను, అవసరం అయితే ఆ ఒక్కర్ని వదిలేసుకుంటాను అని చంద్రబాబు తెగేసి చెప్పారు. తనకు 2019లో అధికారం రావడం కీలకం అని, అందుకోసం కేవలం ప్రజల మన్ననలు పొందిన గెలుపు గుర్రాలనే నమ్ముకుంటానని ఆయన క్లియర్ చేసేసారు. తద్దినానికి పెడితే గానీ లంఖణానికి రాదన్నట్లు, అసలు మరోసారి ఎమ్మెల్యే టికెట్ కే ఎసరు వస్తోంది అంటే, అటు చూస్తారు కానీ, మంత్రి పదవి కోసం చూస్తారా? కాస్త వెనకగడుగు వేస్తారు కదా..అది స్ట్రాటజీ.

సరే, ఎమ్మెల్యేల సంగతి అలా వుంచితే, మరి ఇప్పుడున్న వాళ్ల సంగతేమిటి? దానికి వ్యూహాలు స్టార్ట్ చేసారు. విశాఖలో ఇన్నాళ్లు లేనిది ఒక్కసారిగా ఎమ్మెల్యేలంతా సమావేశమై ఇద్దరు జిల్లా మంత్రులపై అసంతృప్తి బావుటా ఎగరేసారు. ఇన్నాళ్లు వీళ్లంతా ఇద్దరు మంత్రుల్లో ఎవరో ఒకరి వెనుక వున్నవారే. ముఖ్యంగా గంటాతో కలిసి పార్టీలోకి వచ్చిన వారు కూడా వున్నారు. 

మరి వీళ్లందరికీ ఒక్కసారిగా ఎందుకు ఇంతటి తెగింపు వచ్చింది? అంటే వెనకాల సమ్ థింగ్..సమ్ థింగ్ అన్నమాట. ఇదే తరహా లో ఎవరికి తగ్గ వ్యూహాలు వారికి అమలు అవుతున్నాయి. ఇవన్నీ పూర్తయ్యాక..ఎక్కడి వారికి అక్కడ చెక్ పెట్టాక, అప్పుడు మంత్రివర్గ విస్తరణ, మార్పులు చేర్పులు వుంటాయి.

అయితే ఒకటి మాత్రం క్లియర్. ఎప్పటి నుంచో వినిపిస్తున్న మంత్రి వర్గ విస్తరణ, మార్పులు చేర్పులు దగ్గరకు వచ్చేసినట్లే అనిపిస్తోంది. ఈ వ్యూహాలు అన్నీ చూస్తుంటే.

Show comments