కమలదళం రాజనీతి : రాష్ట్రపతి పాలన దిశగా...

‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ అని సినీ కవి గారు ముచ్చట పడ్డారు గానీ.. నిజానికి రాజకీయ నాయకుల మాటలకు అర్థాలు వేరులే.. అని మనకు అనేక సందర్భాల్లో నిరూపణ అవుతుంటుంది. ఇప్పుడు కూడా తమిళనాట రాజకీయాల విషయంలో కమలదళం ప్రదర్శిస్తున్న వైఖరి గమనిస్తే ఇదే సత్యం బోధపడుతోంది. క్రమంగా తమిళ రాజకీయాలను రాష్ట్రపతి పాలన దిశగా వారు నడిపిస్తున్నారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు మాటల్లో.. రాష్ట్రపతి పాలన విధించే ఉద్దేశం తమకు లేదని సెలవివ్వడాన్ని గమనిస్తే.. వారి అంతరంగంలో ఆ ఆలోచన మెదలుతూనే ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. కాకపోతే.. తమిళనాట ముదురుతున్న రచ్చ పక్వానికి వచ్చేవరకు ఆగి ఆ వెంటనే తమ మీదకు నింద రాకుండా, తమ చేతికి మట్టి అంటకుండా.. కాగలకార్యం నిర్వర్తించేయాలని కమలదళం ఆరాట పడుతున్నట్లుగా కనిపిస్తోంది.

తమిళనాడులో ప్రస్తుతం క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయి. మామూలుగా వ్యక్తిపూజకు పెట్టింది పేరు అయిన తమిళ నాట రాజకీయాల్లో ఇలా పార్టీల్లో తిరుగుబాటు, క్యాంపులు అనూహ్యమైన సంగతి అయితే ఇప్పుడు శశికళ- పన్నీర్ సెల్వం క్యాంపులు ముమ్మరంగా పావులు కదుపుతున్నాయి.

పన్నీర్ సెల్వం కు అనుకూలంగా భాజపా రాజకీయాలు నడుపుతున్నదని, లేదని కొన్ని పుకార్లు షికారు చేస్తోంటే.. మద్యలో మరో రాజకీయమూ నడుస్తోంది. పన్నీర్ సెల్వం రాజీనామా తరువాత.. శశికళ రంగం సిద్ధం చేసుకున్న తర్వాత.. గవర్నర్ అందుబాటులోకి రాకపోవడమే ఒక చిత్రం. అయితే ముంబాయి వెళ్లి అయినా గవర్నరుతో భేటీ అయి సంక్షోభాన్ని తారస్థాయికి తీసుకువెళ్లడానికి పన్నీర్ కూటమి సిద్ధంగానే ఉంది. ఆయన ముంబాయిలోని విద్యాసాగర్ రావు అపాయింట్ మెంట్ కోరినట్లుగా వార్తలు వస్తున్నాయి. పన్నీర్ సెల్వం ముంబాయి వెళ్లి గవర్నరుతో చెప్పబోయేది ఏమిటో స్పష్టం. ‘‘నాతో బలవంతంగా రాజీనామా చేయించారు. నాకు పార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉంది. నా రాజీనామా వ్యవహారాన్ని పరిగణనలోకి తీసుకోకుండా.. నాకు బల నిరూపణ అవకాశం ఇవ్వండి’’ అనే ఆయన చెప్పబోతున్నారు. అంతవరకు స్పష్టంగానే ఉంది. అయితే అదే జరిగితే.. అది రాజకీయంగా రాష్ట్రంలో మరింత అనిశ్చితికి దారి తీస్తుందే తప్ప.. ఫుల్‌స్టాప్‌గా మారుతుందనే గ్యారంటీ లేదు. ఆ రకమైన అనిశ్చితి కేంద్రానికి అనుకూలాంశంగా కనిపించవచ్చు. అనిశ్చితిలోంచి రాష్ట్రపతి పాలన దిశగా వారి ఆలోచన సాగవచ్చు.

తమిళనాట నేరుగా ఒక్కసీటు కూడా గెలుచుకోగల స్థితిలో లేని భాజపా.. రాష్ట్రపతి పాలన రూపేణా.. కొన్నాళ్లు కేంద్రం ద్వారా తామే పరోక్ష పాలన సాగించి.. అక్కడి ప్రజల దృష్టిలో తమ పార్టీకి ఒక పాజిటివ్ ఇమేజి సృష్టించుకోవాలని ఆశపడవచ్చు. కానీ.. వారి ఎత్తులు పైఎత్తులు ఏ మేరకు సానుకూలం అవుతాయో.. వ్యక్తిపూజకు, స్వల్ప ప్రలోభాలకు దాసులైన ప్రజాప్రతినిధులుండే తమిళసీమలో వ్యూహాలు ఎలా మారుతాయో చూడాలి. 

Show comments