దర్శకుడు పూరి జగన్నాధ్ తన సినిమాలకు ఫ్యామిలీలను దూరం చేసుకుంటూ వస్తున్నాడన్నది వాస్తవం. లోఫర్ సినిమాను మంచి ఫ్యామిలీ సినిమాగా మార్చగలిగిన అవకాశాలు పుష్కలంగా వుండి కూడా పోసానితో తండ్రి క్యారెక్టర్ ను తన చిత్తానికి చేయించి, ఫ్యామిలీలను సినిమాకు దూరం చేసాడు.
వాస్తవికత అనో, మరోటి అనో పేరుచెప్పి, రాను రాను తన సినిమాల్లో రఫ్ నెస్ పెంచేస్తున్నాడు పూరి. భయంకరమైన రౌడీ ముఖాలు, ముక్కు, చెవి పోగులు, జులపాలు, మాదక ద్రవ్యాలు, అమ్మాయిలను రఫ్ గా డీల్ చేయించడాలు ఇలాంటి అన్నీ కలిసి ఫ్యామిలీలు పూరి సినిమా అంటే భయపడేలా చేసేసాడు.దానికి తోడు డైలాగుల సంగతి చెప్పనక్కరలేదు. టెంపర్ సినిమాలో రేప్ సీన్ ను కాస్త పాలిష్ చేసి వుంటే, సినిమా మరిన్ని కోట్లు ఆర్జించేది అని ఇండస్ట్రీలో ఓ ఒపీనియన్ వుంది.
తాజాగా కళ్యాణ్ రామ్ తో ఇజమ్ సినిమా చేస్తున్నాడు. ఇజమ్ డేట్ పోస్టర్ పడింది. దానిపై క్యాప్షన్ మళ్లీ రెగ్యులర్ పూరి ఫార్మాట్ లోనే వుంది. సొసైటీ హవుస్ ఫుల్ విత్ లుచ్చా అండ్ లంఫంగీస్ అంటూ. లుచ్చాలు, లఫంగీలు లాంటి పదజాలం వాడి ఫ్యామిలీలను రమ్మంటే ఎలా వస్తారు? పైగా దాన్నే విడుదలకు ముందు పోస్టర్ గా పెట్టడం అంటే ఫ్యామిలీలకు చట్టబద్ధమైన హెచ్చరిక ఇచ్చినట్లే కదా? ఈ విషయంలో నిర్మాత, హీరో కళ్యాణ్ రామ్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు, అయినా పూరి వినలేదని తెలుస్తోంది.
సినిమాలకు యంగ్ జనరేషన్ ఒక్కరే మహరాజ పోషకులు కాదు. ఫ్యామిలీలు కదిలివస్తేనే ఎక్కువ టికెట్ లు తెగేది. ఆ విషయం పూరి పూర్తిగా విస్మరించేసారు. టైటిళ్లు, సీన్లు, డైలాగులు అన్నింటా ఆయన రఫ్ నెస్ పెంచుకుంటూ పోతున్నారు. బహుశా అందుకేనేమో, ఎన్టీఆర్ కూడా సినిమా ఇవ్వడానికి ముందు వెనుక ఆడుతున్నట్లుంది.