చైనా రంకెలు.. లెక్క చేయని ఇండియా!

అరుణాచల్ ప్రదేశ్ ను భారత్ లో అంతర్భాగంగా గుర్తించదు చైనా.. ప్రత్యేకించి ఆ రాష్ట్రంలోని తవంగ్ రీజన్ ను చైనా తన దేశంలో భాగంగా చెప్పుకుంటుంది. తమ దేశంలోని మ్యాప్ లలో దాన్ని తమ ప్రాంతంగా గుర్తించుకుని ఆనందిస్తుంది. అయితే ఆ ప్రాంతంపై పూర్తి ఆధీనత భారత్ చేతుల్లో ఉంది. అయినప్పటికీ చైనా రంకెలు వేస్తూ ఉంటుంది.

ఆ ప్రాంతంలో తమ అనుమతి లేకుండా ప్రముఖులు ఎవ్వరూ అడుగు పెట్టకూడదనేది చైనా హూంకరింపు. అయితే భారత్ మాత్రం ఈ విషయంలో చైనాను ఎప్పుడూ ఖాతరు చేయడం లేదు. తవంగ్ రీజియన్ లో జరగనున్న బౌద్ధమత సమావేశానికి హాజరు కావడానికి అనుమతి కోరిన దలైలామకు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత శరణార్థిగా ఉన్న ఈ మత గురువు అక్కడకు వెళ్లడానికి ప్రభుత్వం ఓకే చెప్పింది. దీంతో చైనా మళ్లీ రంకెలు వేస్తోంది!

తమ శత్రువును తమ ప్రాంతంలోకి వెళ్లడానికి ఇండియా అనుమతిని ఇవ్వడం ఏమిటి? అంటూ చైనా అంటోంది. కానీ.. పూర్తిగా తమ అంతర్భాగం అయిన అరుణాచల్ లో దలైలామా వెళ్లడం పట్ల చైనా అభ్యంతరాలు ఏమిటి?  అని ప్రశ్నిస్తోంది.

ఇది వరకూ 2009లో కూడా దలైలామా తవంగ్ ప్రాంతాన్ని సందర్శించాడు. అప్పట్లో కూడా చైనా అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఇండియా లెక్కచేయలేదు. అలాగే  ప్రతిభాపాటిల్ రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఆమె అక్కడకు వెళ్లడంపై చైనా నిరసన వ్యక్తం చేసింది. ఇటీవలే ఇండియాలోని అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ.. అరుణాచల్ ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు అక్కడ పర్యటించాడు. 

చైనా మాత్రం తన రొటీన్ హూంకరింపులు ఆపడం లేదు. భారత భూ భాగంలోని వ్యవహారాలపై అనవసరంగా ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తూ ఆయాసం తెచ్చుకుంటున్నారు చైనీ పాలకులు.

Show comments