పాపం... రాహుల్ పై మీడియా డబుల్ టోన్!

ఆయనకు కొత్తగా పోయిందేమీ లేదు.. అనడం రాహుల్ గాంధీ విషయంలో మీడియా ఒలకపోస్తున్న అతి వ్యంగ్యంలో ఒక మాట. యూపీలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయిన నేపథ్యంలో రాహుల్ పై ఒక రేంజ్ లో పడిపోయింది మీడియా. కాంగ్రెస్ ఓటమి నిజమే.. ఏ పార్టీ ఓటమికి అయినా దాని అధినాయకత్వం చాలా వరకూ పాత్ర పోషిస్తుంది.  కాంగ్రెస్ పార్టీ ఇంత చిత్తు చిత్తుగా ఓడిపోవడానికి కారణం సోనియా, రాహుల్ ల విధానాలు అని కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ.. కాంగ్రెస్ నాడు కేంద్రంలో అనుసరించిన విధానాలతో పోలిస్తే.. బీజేపీ అంత అభినందించదగిన స్థానంలో కూడా ఏమీ లేదనే చెప్పాలి.

ధరల నియంత్రణలో అయితేనేం.. కార్పొరేట్లకు కొమ్ము కాయడంలో అయితేనేం.. ప్రజలపై భారాలను మోపడంలో అయితేనేం.. యూపీఏ కన్నా ఎన్డీయే చాలా పండిపోయింది. అప్పుడు సోనియాగాంధీ నియంతృత్వం నడిస్తే.. ఇప్పుడు మోడీ నియంతృత్వం నడుస్తోంది. వ్యక్తులు వేరు కానీ, విధానాల్లో మాత్రం అదే తీరు. 

మరి ఈ సంగతిలా ఉంటే.. రాహుల్ విషయంలో తీవ్రంగా  సెటైర్లు వేస్తున్న మీడియా పంజాబ్ విషయంలో మాత్రం మాట్లాడకపోవడాన్ని గమనించవచ్చు. యూపీలో ఎస్పీ కాంగ్రెస్ ల ఓటమికి రాహులే కారణం అని తేలికగా అనేస్తున్నారు. రాహుల్ ఐరన్ లెగ్ ఎస్పీని కూడా ముంచిందని జాతీయ మీడియా విశ్లేషకులు కూడా అంటున్నారు. అయితే… అదే రాహుల్ గాంధీ పంబాబ్ లో కూడా కాలికి బలపం కట్టుకుని తిరిగాడని వేరే చెప్పనక్కర్లేదు.

పంజాబ్ లో రాహుల్ గట్టిగా తిరిగి ప్రచారం చేస్తుంటే.. ఇదే మీడియా ఆయనపై దుమ్మెత్తిపోసింది. ఎలాగూ పంజాబ్ లో కాంగ్రెస్ ఓడిపోతుందని… అక్కడ ఆప్ గెలుస్తుందని.. అలాంటి చోట రాహుల్ ఎక్కువగా ప్రచారం చేస్తున్నాడని, ఆయనకు పని లేక ఇలాంటి పని చేస్తున్నాడని.. యూపీలో  కేటాయించాల్సిన సమయాన్ని పంజాబ్ లో కేటాయించి రాహుల్ పొరపాటు చేస్తున్నాడని.. మీడియా ఎన్నికల ప్రచార సయమంలో విశ్లేషించింది. మరి ఇప్పుడేమో… పంజాబ్ లో కాంగ్రెస్ విజయానికి, రాహుల్ కు ఏ మాత్రం సంబంధం లేదు, యూపీలో కూటమి ఫెయిల్యూర్ కు మాత్రం రాహులే బాధ్యుడు అని తేల్చి పడేసింది!

ఇదీ మీడియా తీరు.. రాజకీయ నేతగా రాహుల్ ఏ మాత్రం సమర్థించదగిన వ్యక్తి కాకపోవచ్చు, కానీ.. ఆయన విషయంలో మీడియా డబుల్ టోన్ మాత్రం పరిశీలించదగిన అంశమే. 

Show comments