ఇదేం స్వార్థం రఘువీరా రెడ్డి..!

'అలా అయితే.. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు కాంగ్రెస్‌ మద్దతునిస్తుంది..' అని అంటున్నాడు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి! ఒకవైపు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశం కేవలం ఏపీలో అధికార పార్టీ టీడీపీ, తెలంగాణలో అధికార పార్టీ తెరాసాల స్వార్థపూరితం అని విమర్శిస్తూనే.. మరోవైపు రఘువీరారెడ్డి పునర్విభజనకు కాంగ్రెస్‌ మద్దతునిస్తుంది అని చెప్పుకొస్తున్నాడు. 

ఈయన ఇలా మాట్లాడటం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. వాస్తవంగా చెప్పాలంటే సీట్ల పెంపుదలను అధికార పార్టీలు కోరుకుంటుండగా, ప్రతిపక్షంలోని పార్టీలు వద్దని అంటున్నాయి. ఇప్పుడే అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగి.. పునర్విభజన చేసుకునే అవకాశం వస్తే.. తోచినట్టుగా వాటిని ఏర్పాటు చేసుకునే అవకాశం వస్తుందనేది తెలుగుదేశం, తెరాసాల ఆలోచన. 

ఎలాగూ అధికారం చేతిలో ఉంది కాబట్టి, కావాల్సినంత మంది అభ్యర్థులను కూడా తయారు చేసుకోవచ్చు. కోట్లరూపాయలు కుమ్మరించేయవచ్చు. అదే ప్రతిపక్షాలకు మాత్రం ఈ అవకాశాలు తక్కువ. పునర్విభజన జరిగితే తాము అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను పెట్టగలమా అనేది ప్రతిపక్షాల సందేహం! అందుకే.. అసెంబ్లీ సీట్ల పెంపు విషయంలో ఇరువర్గాల నుంచి పరస్పర విరుద్ధమైన మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే రఘువీరారెడ్డి మాత్రం పునర్విభజనకు కాంగ్రెస్‌ మద్దతునిచ్చేస్తుంది.. అని అంటున్నాడు. మరి దీనివెనుక లెక్కేమిటీ అంటే, అది రఘువీరారెడ్డి వ్యక్తిగత స్వార్థం. ప్రస్తుతం ఈయనకు నియోజకవర్గం లేదు!

గతంలో మడకశిర నుంచి ప్రాతినిధ్యం వహించారీయన. అదికాస్తా.. రిజర్వడ్‌ కేటగిరిలో పోయింది. ఆ తర్వాత కల్యాణదుర్గంలో ఒకసారిపోటీ చేసి గెలిచినా, రెండోసారిపోటీ చేసే ధైర్యం లేకపోయింది.. మొన్నటి ఎన్నికల్లో పెనుకొండ నుంచి పోటీచేస్తే పరవు దక్కలేదు. మరి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా కీర్తనలు పొందుతున్న రఘువీరారెడ్డికి పోటీ చేసేందుకు ఒక నియోజకవర్గం కావాలి కదా! 

అందుకే.. పునర్విభజన జరగాలని రఘువీరుడు ఆకాంక్షిస్తున్నాడు. అలా జరిగితే.. మడకశిర రిజర్వ్‌డ్‌ కేటగిరినుంచి బయటపడుతుందనేది రఘువీరుడి ఆశ. తను మళ్లీ గతంలో ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కోసం.. పునర్విభజన జరగాలని ఈయన కోరుకుంటున్నాడు. తెలుగుదేశం మాటనే మాట్లాడుతున్నాడు!

Show comments