హమ్మయ్య.. ఎట్టకేలకు ఓ ప్రసహనం ముగిసింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విషయంలో అధికార పక్షం 'పెద్దమనసు' ప్రదర్శించేసింది.! అసెంబ్లీలో వైఎస్ జగన్ తీరుని ఖండిస్తూ తీర్మానాన్ని పాస్ చేయించేశారు. ఇక, వివాదం ముగిసినట్లేనా.? రేపట్నుంచి, అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగుతాయా.? ఏమో, ప్రస్తుతానికైతే కొంత మేర పరిస్థితి 'కంట్రోల్'లోకి వచ్చినట్లే కన్పిస్తోంది.
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు - ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మధ్య ఆరోపణల పర్వం, ఈ క్రమంలో ప్రత్తిపాటి సవాల్ విసరడం, ఆ సవాల్‌పై స్పందించేందుకు తనకు అవకాశమివ్వలేదని సభలో జగన్ వాపోవడం, సవాల్‌కి ఒప్పుకుంటారా.? లేదా.? అంటూ అధికార పక్షం ఒత్తిడి తీవ్రతరం చేయడం తెల్సిన విషయాలే. నిన్న, ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఇదే రచ్చ కొనసాగింది. జగన్, ప్రత్తిపాటి సవాల్‌ని స్వీకరించలేదు. ప్రత్తిపాటి - జగన్ తన సవాల్‌కి స్వీకరించకపోతే ససేమిరా.. అంటూనే వున్నారు. ఈ క్రమంలోనే జగన్, అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోయారు ఈ రోజు తన ఎమ్మెల్యేలతో కలిసి.
జగన్ తీరుని ఖండిస్తూ, అధికారపక్షం తీర్మానాన్ని మూవ్ చేయడంతో.. టీడీపీ నేతలు, బీజేపీ నేతలు, వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసినవారు.. జగన్ మీద ఘాటైన విమర్శలతో విరుచుకుపడ్డారు. మరీ ముఖ్యంగా జ్యోతుల నెహ్రూ, ఎస్వీ మోహన్‌రెడ్డి - చంద్రబాబు మెప్పు కోసం పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు. చంద్రబాబు పెద్ద మనసు గురించి సభలో జరిగిన భజన చూస్తే.. ఇది జగన్ తీరుని ఖండించడానికి జరిగిన తీర్మానంలా కన్పించలేదు.. అది కేవలం చంద్రబాబు భజన కోసం చేసిన తీర్మానం అన్పించింది.
ఎలాగైతేనేం, 'ఇక్కడితో ఈ వివాదానికి ముగింపు పలుకుతూ..' అన్న మాట అధికార పక్షం నుంచి వచ్చింది. కానీ, ఆ మాటకు కట్టుబడి అధికార పార్టీ నేతలు రేపట్నుంచి సభలో వ్యవహరిస్తారా.? వేచి చూడాల్సిందే.