అణచివేతలకు ఒక శాశ్వతమైన ఏర్పాటు!

తెలంగాణ పోలీసులకు ఒక చిత్రమైన ఆలోచన వచ్చింది. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జరిగే నిరసనలను నీరుగార్చడానికి వారు ఇప్పుడు సరికొత్త వ్యూహరచన చేశారు. ప్రజాందోళనలకు ఎలాంటి ప్రాచుర్యం లేకుండా, రాకుండా చేయడానికి కొత్త ప్లాన్ వేశారు. ఢిల్లీలో ఉన్న ఏర్పాటు తరహాలోనే చేస్తున్నాం... అని పైకి సెలవిస్తున్నారు గానీ.. లోలోన ప్రజాందోళనలకు దిక్కూ దివాణం లేకుండా చేసేయడమే అసలు వ్యూహంగా కనిపిస్తోంది. ఎవరైనా సరే.. ఎలాంటి ఆందోళనలు చేపట్టడానికైనా హైదరాబాదు నగర శివార్లలో ఓ యాభై ఎకరాల స్థలాన్ని ధర్నా చౌక్ గా కేటాయించాలని పోలీసులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అంటే.. తమ డిమాండ్ల గురించి ప్రభుత్వానికి నివేదించుకోదలచుకున్న వారిని వెలివాడల్లో ఉంచినట్లుగా ఊరిబయట ఓ ప్రత్యేకమైన స్థలంలో ఉంచుతారన్నమాట. ఊరిలోకి కూడా రానివ్వకుండా, ఇక పాలకులకు తమ నిరసనల మోతాదును చూపించే అవకాశమే లేకుండా చేసేస్తారన్నమాట. 

హైదరాబాదు పోలీసుల్లో ఇలాంటి ‘వెలివాడ ధర్నాచౌక్’ అనే ఆలోచన ముందునుంచి ఉన్నదో లేదో తెలియదు గానీ.. తాజాగా కోదండరాం చేపట్టదలచిన నిరుద్యోగ ర్యాలీ, దానికి సంబంధించి కోర్టులో జరిగిన వాదోపవాదాల నేపథ్యంలో, ఈ ఆలోచన ప్రతిపాదనలుగా రూపుదాలుస్తున్నట్లుంది. నగరంలో ప్రజా జీవితానికి ఇబ్బంది లేకుండా.. నాగోలులో సభ పెట్టుకోవాలని హైకోర్టు జేఏసీకి సూచించింది. అయితే నాగోలుకు ఎవ్వరూ రాలేరని , చాలా దూరం అవుతుందని అంటూ ముందుగానే కోదండరాం బృందం కేసు ఉపసంహరించుకుంది. 

సరిగ్గా ఈ పాయింటు దగ్గరే పోలీసులకు కొత్త ఆలోచన మొగ్గ తొడిగినట్లుంది. అసలు ధర్నాచౌక్ నే ఊరిబయట దూరంగా ఏర్పాటు చేసేస్తే.. ధర్నాలూ తగ్గుతాయి. ఎప్పటికప్పుడు ఏ దశలో కావాలంటే ఆ దశలో వాటికి అడ్డుకట్ట వేయడానికి నియంత్రణ మొత్తం పోలీసులకు సులువు అవుతుంది అని వారు అనుకున్నట్లంది. అందుకే సుమారు 50 ఎకరాల్లో ధర్నాచౌక్ ఊరిబయట ఏర్పాటు చేయాలంటూ వారు ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇవ్వబోతున్నారని సమాచారం. ప్రస్తుతం ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్ ఉంది. నిజానికి చిన్నా పెద్దా ఆందోళనలు చేయదలచుకున్న అందరికీ ఇది ఎంతో సౌకర్యంగా ఉంది. అదేమీ ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతం కాకపోవడంతో.. ఎవ్వరికీ ఇబ్బందులు కూడా కలగడం లేదు. అయితే ఇది సెక్రటేరియేట్ కు సమీపంలో ఉన్న ప్రాంతం. అలాంటి అవకాశం లేకుండా.. ధర్నాలను, ప్రజాందోళనలను ఊరిబయటకు తరిమేసి, వెలివాడల్లో ఉంచాలని పోలీసులు భావిస్తున్నట్లుంది.

పైకి మాత్రం ఢిల్లీలోని జంతర్‌మంతర్ తరహాలో ఈ ఏర్పాటుచేస్తాం అంటున్నారు. కానీ నిజానికి జంతర్ మంతర్ నగరం నడిబొడ్డులోనే ఉంటుంది. పార్లమెంటుకు చాలా దగ్గరలోనే ఉంటుంది. ఆ అంశాలను పట్టించుకోకుండా.. హైదరాబాదులో ప్రస్తుతం అందరికీ అనువుగా ఉన్న ధర్నాచౌక్ ను ఊరి వెలుపలకు తరలించేయాలని చూడడం ... ఆందోళనలను అణచివేయడానికి ఒక శాశ్వతమైన ఏర్పాటు మాత్రమే అని పలువురు విశ్లేషిస్తున్నారు. 

Show comments