వైసీపీలో అంతా 'ప్రశాంత'మేనా జగన్‌.?

రెండేళ్ళలోపే ఎన్నికలు.. ఇప్పటికే చేజారిన 21 మంది ఎమ్మెల్యేలు.. అంతు పట్టని 'జనం నాడి'.. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓ వ్యూహకర్తని నియమించుకుంది. అతనే ప్రశాంత్‌ కిషోర్‌. దేశ రాజీయాల్లో పరిచయం అక్కర్లేని వ్యక్తి ఈయన. ఒకప్పుడు నరేంద్రమోడీకి వ్యూహకర్తగా పనిచేశారు.. ఆ తర్వాతా పలు రాష్ట్రాల్లో తన 'సేవ'లందించారు. ఇప్పుడాయన, ఆంధ్రప్రదేశ్‌పై ఫోకస్‌ పెట్టారు. కాదు కాదు, వైఎస్‌ జగన్‌ ఆయన్ని తెలుగు గడ్డ మీదకు తీసుకొచ్చారు. 

2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్సీపీ, ప్రశాంత్‌ కిషోర్‌ సలహాల్ని సూచనల్ని తీసుకోవడం అప్పుడే ప్రారంభించింది. పాదయాత్ర సహా, వైఎస్సార్సీపీ ఇటీవలి కాలంలో ప్రకటిస్తున్న చాలా నిర్ణయాల్లో ప్రశాంత్‌ కిషోర్‌ ముద్ర సుస్పష్టంగా కన్పిస్తోంది. నిర్ణయాలు వైఎస్‌ జగన్‌వే అయినా, ఆ నిర్ణయాలకు సంబంధించి లోటుపాట్లను ఎత్తిచూపడం, మరింత సమర్థవంతంగా ఆయా నిర్ణయాలు బయటకొచ్చేలా చేయడం.. ఇదీ ప్రశాంత్‌ కిషోర్‌ బాధ్యత. 

మామూలుగా అయితే ఏ పార్టీకి అయినా సీనియర్లే సలహాదారులు. కానీ, రాజకీయాలు మారాయి. సీనియర్లకు కాలం చెల్లిందిప్పుడు. కాలం చెల్లిన విధానాల్ని ప్రజలు తిరస్కరిస్తున్నారన్న భావనతో కొత్తగా ఈ 'సలహాదారులు' తెరపైకొస్తున్నారు. వారే సలహాదారులు, వారే వ్యూహకర్తలు. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీ అధినేత తర్వాత ఆ స్థాయి వ్యక్తి ఎవరన్నా వున్నారంటే, అది ఆ వ్యూహకర్త మాత్రమే. ఆ లెక్కన వైఎస్సార్సీపీలో ఇప్పుడు ప్రశాంత్‌ కిషోర్‌ని నెంబర్‌ టూగా అనుకోవచ్చు. 

కానీ, ఇక్కడ.. ఆంధ్రప్రదేశ్‌లో ఈ రాజకీయ వ్యూహాలు వర్కవుట్‌ అవుతాయా.? ఏమోగానీ, వ్యూహకర్త విషయంలో వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు కొందరు అసంతృప్తితో వున్నారనే వాదన గట్టిగానే విన్పిస్తోంది. 'ఫలానా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఏమీ బాగాలేదు..' అంటే దానర్థం, అక్కడి నాయకత్వం సమర్థవంతంగా పనిచేయడంలేదనే కదా.! ఇక్కడే, వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్‌కీ, స్థానిక నాయకత్వానికీ మధ్య 'గ్యాప్‌' క్రియేట్‌ అవుతోంది. 

వ్యూహకర్తని బోల్డంత సొమ్ము వెచ్చించి నియమించుకున్నాక, ఆయనకి తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిందే కదా.! ఈ క్రమంలో స్థానిక నాయకత్వాన్ని అధినేత ఒక్కోసారి లైట్‌ తీసుకోవాల్సి వస్తుంది కూడా. ఇదే ఇప్పుడు వైఎస్సార్సీపీకి ఇబ్బందికరంగా మారింది. 'అబ్బే, సీనియర్ల మీద ప్రశాంత్‌ కిషోర్‌ పెత్తనమేమీ వుండదు.. ఆయన సలహాలిస్తారు, సూచనలు చేస్తారు.. వ్యూహాల గురించి చెబుతారు.. అంతకు మించి ఇంకేమీ వుండదు..' అని సీనియర్‌ నేతలు పైకి చెబుతున్నా, తెరవెనుక వ్యవహారం వేరేలా వుంది. 

మొన్నటికి మెన్న ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రశాంత్‌ కిషోర్‌ వ్యూహాలు దెబ్బతిన్న దరిమిలా, ఆ విషయాన్ని పార్టీ ముఖ్య నేతలే వీలు చిక్కినప్పుడల్లా అధినేత వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళుతున్నారు. 'ముఖ్య నేతలే కాదు, స్థానిక నేతల మీద పెత్తనం అంటే కష్టమే..' అన్న అభిప్రాయాలు గట్టిగానే వ్యక్తమవుతున్నాయి వైఎస్సార్సీపీలో. అధినేతకు ఎదురుతిరగలేనివారేమో, ఎంచక్కా మీడియాకి లీకులు ఇచ్చేస్తున్నారు. వైఎస్సార్సీపీలో కొత్త పవర్‌ సెంటర్‌ ప్రశాంత్‌ కిషోర్‌.. అన్న ప్రచారానికి కారణం కూడా ఇదే. 

పార్టీ నేతలకు నొప్పి కలగకూడదు.. ప్రశాంత్‌ కిషోర్‌ వ్యూహాలకు ఇబ్బందులుండకూడదు.. ఈ రెండూ జరగాలంటే అది వైఎస్‌ జగన్‌కి కత్తిమీద సామే.! కానీ, తప్పదు. రాజకీయాలు మారాయి కదా.! మరి, ఈ బ్యాలెన్స్‌ సెట్‌ అవుతుందా.? ఏమో, వేచి చూడాల్సిందే.

Show comments