ఆరు నెలల పాటు కర్రసాము నేర్చుకుని.. మూలనున్న ముసలమ్మ మీద దాన్ని ప్రయోగించినట్టుంది పవన్ కల్యాణ్ తీరు. మోడీని అనే ధైర్యం లేకపోతే.. ఈ ఇష్యూ గురించి మాట్లాడకపోవడం మంచిది. అన్నీ సగం సగం పనులు వద్దు. దమ్మూధైర్యాలు ఉంటే.. మోడీని అనండి. ఏపీలో విభజనకు కాంగ్రెస్సు, జగన్లే కారణం అని, తెలంగాణలో మాత్రం విభజన క్రెడిట్ బీజేపీదే అని.. మీరు ఎన్నికల సమయంలో మాట్లాడి ఉండవచ్చు గాక, ప్రతి ఇష్యూలోనూ ఇలాంటి డబుల్ టోన్లు వినిపించడం మాత్రం సబబు కాదు!
జరుగుతున్న ప్రతి పరిణామాన్నీ ఇక్కడ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈ విషయాన్ని జనసేన అధినేత అర్థం చేసుకోంటే మంచిది!
ఇంతకీ పవన్ కల్యాణ్ ఏమంటాడంటే.. నోట్ల రద్దు నిర్ణయం ఫలితంగా క్యూలైన్లలో ప్రజలు చనిపోవడానికి బాధ్యుడు ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేలే అంటున్నాడు!
ఇది ఎంత హాస్యాస్పదమైన మాటో వేరే చెప్పనక్కర్లా! ఊర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నరే అయ్యుండవచ్చు. కానీ.. నోట్ల రద్దు నిర్ణయం ఆయనది కాదు. ఇంతటి తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకునేంత సీన్ ఆర్బీఐ గవర్నర్ కు లేదసలు. అసలు నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించింది ఎవరో? పవన్ కు తెలియదా? బహశా ఆ నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు పవన్ తన సినిమాలతో బిజీగా ఉన్నాడు కాబోలు. పవన్ ముందుగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే.. నోట్ల రద్దు నిర్ణయం ప్రధానమంత్రి మోడీది.
స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ విషయాన్ని అనౌన్స్ చేశాడు. ఈ విషయంలో కర్త, కర్మ,క్రియ.. అన్నీ మోడీనే అని స్పష్టం అవుతోంది. అంత వరకూ ఎందుకు? లోక్ సభలో వివిధ పార్టీల ఎంపీలు మాట్లాడుతూ.. కనీసం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కూడా మోడీ విశ్వాసంలోకి తీసుకోకుండా.. ఈ నోట్లరద్దు నిర్ణయాన్ని ప్రకటించాడని ధ్వజమెత్తారు.
బహుశా.. ఆర్బీఐ గవర్నర్ కు నోట్ల రద్దు నిర్ణయంపై సమాచారం ఉంటే ఉండవచ్చు గాక.. కానీ, ఈ విషయంలో మోడీని ప్రభావితం చేసే శక్తి ఆయనకు లేదనే చెప్పాలి!
అయినా.. ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్టు.. ఆర్బీఐ గవర్నర్ మీద పడటం ఏంటండీ! అసలు సిసలు మోడీని ఏమీ అనరు, నోట్ల రద్దు నిర్ణయం తన సలహా మేరకే అని ప్రకటించిన చంద్రబాబూనే ఏమనకుండా.. ఆర్బీఐ గవర్నర్ ను బాధ్యుడు అంటే.. అది కామెడీ చేయడం కాదా?