ఔనా.? కోడెల బుక్కయ్యారా.? నమ్మొచ్చా.?

అసెంబ్లీ సాక్షిగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా ఏడాదిపాటు సస్పెండ్‌ అయ్యారు. మరి, ఎన్నికల నిబంధనావళికి విరుద్ధంగా, కోడెల శివప్రసాద్‌ గత ఎన్నికల్లో 11.5 కోట్లు ఖర్చు చేస్తే, ఆయనపై చట్టపరమైన చర్యలు ఎలా వుండాలి.? ఓ న్యూస్‌ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోడెల, ఎన్నికల ఖర్చుపై నోరు జారేశారు. అప్పట్లో ఈ వ్యవహారంపై పెద్ద దుమారమే చెలరేగింది. 

ఇవే వ్యాఖ్యలు వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్యేలెవరైనా చేసి వుంటే, ఈ పాటికి సదరు ఎమ్మెల్యే పదవి ఊడిపోయేది. కానీ, పొరపాటు దొర్లింది టీడీపీ నేత నుంచి కదా.! అందుకే, వ్యవహారాన్ని జాగ్రత్తగా కామప్‌ చేసేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కయిపోయినా, చంద్రబాబు ఇప్పటికీ బుకాయించగలుగుతున్నారంటే.. టీడీపీ అధికారంలో వుండడం వల్లే మరి.! 

ఇప్పుడిదంతా ఎందుకంటే, కోడెల వ్యవహారంపై కేంద్ర హోంశాఖ సీరియస్‌ అయ్యిందట. ఈ వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చాలంటూ కేంద్ర హోంశాఖ, ఏపీ సీఎస్‌కి ఆదేశాలు జారీ చేసిందట. ఓ న్యాయవాది ఫిర్యాదు మేరకు హోంశాఖ ఈ చర్యలు చేపట్టిందనే ప్రచారం జరుగుతోంది. ఇదెంత నిజం.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే. ఒకవేళ నిజమైతే గనుక, కోడెల కన్నా ఎక్కువగా చంద్రబాబే కంగారు పడాలి. ఎందుకంటే, అలాంటి మహానుభావుడ్ని స్పీకర్‌గా చేసింది చంద్రబాబే కదా.! 

హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళడమో, లేదంటే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుగారిని రంగంలోకి దించి, వివాదాన్ని చల్లార్చడమో.. ఈ అంశాలపై ఇప్పటికే చంద్రబాబు కంగారు పడుతుండే వుండొచ్చుగాక. 

ఎన్నికల నిబంధనావళి ప్రకారం ఎమ్మెల్యే అభ్యర్థి చేయాల్సిన ఖర్చు 28 లక్షల లోపు మాత్రమే. కోడెల శివప్రసాద్‌, ఎన్నికల సమయంలో ఇచ్చిన అఫిడవిట్‌ ప్రకారం ఆయన ఆస్తులు 5.8 కోట్లు మాత్రమే. మరి, 11.5 కోట్లు ఎలా ఖర్చు చేసినట్లు.? నిజాలు నిగ్గు తేలేదెలా.?

Show comments