ఇంకేం చేస్తాం.. సర్దుకుపోతాం.!

ఇకపై తాత్కాలిక సచివాలయం అన్న పేరు వాడకపోతేనే మంచిది. అమరావతిలో కార్యకలాపాలు లాంఛనంగా నేటి నుంచి ప్రారంభమయ్యాయి. గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త సచివాలయం నుంచి కార్యకలాపాలు ప్రారంభించినా, ఉద్యోగులు తాజాగా నేడు 'సచివాలయ ప్రవేశం' చేయడంతో, ఇప్పటినుంచే సచివాలయం అందుబాటులోకి వచ్చిందని భావించాల్సి వుంటుంది. 

ఇల్లు అలకగానే పండగ కాదు. అదే సమయంలో, ఏ ప్రయాణమైనా మొదటి అడుగుతోనే ప్రారంభమవుతుంది. ఇలా రెండు కోణాల్లోనూ అమరావతిని, సచివాలయాన్నీ చూడాల్సి వుంటుంది. రెండేళ్ళ ఆలస్యం సంగతి పక్కన పెడితే, కేవలం నాలుగు నెలల్లో సచివాలయ నిర్మాణాన్ని చేపట్టి, ఓ కొలిక్కి తీసుకురావడమంటే చిన్న విషయం కాదు. అదే సమయంలో, 'మేం వచ్చేది లేదు..' అని భీష్మించుక్కూర్చున్న ఉద్యోగులు, మెట్టుదిగి.. ప్రభుత్వానికి సహకరించేందుకు ముందుకు రావడమూ ఆషామాషీ వ్యవహారం కాదు. 

వాతావరణ పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తే, అమరావతిలో వాతారణానికీ హైద్రాబాద్‌లో వాతావరణానికీ స్పష్టమైన తేడా. చెమట, ఉక్కపోత.. అమరావతిలో ప్రతికూలాంశాలు. దాదాపు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. అయినప్పటికీ, ఇక్కడినుంచే హైద్రాబాద్‌కి వెళ్ళి, అక్కడే సెటిలైపోయిన ఉద్యోగులు.. తిరిగి సొంత రాష్ట్రానికి వెళ్ళడం అనివార్యమయ్యింది. సో, వాతావరణ పరిస్థితులకీ ఉద్యోగులు ముందు ముందు అలవాటుపడతప్పదు. 

సచివాలయానికి వెళ్ళిన హైద్రాబాద్‌ ఉద్యోగులు ముందుగా వ్యక్తం చేసిన అభిప్రాయం వాతావరణం గురించే కావడం గమనార్హం. దానికి తోడు, సచివాలయానికి వెళ్ళే దారి ఇరుకుగా వుండడమూ ప్రతికూలాంశమే. ముందు ముందు ఈ రహదారి పూర్తిస్థాయిలో విస్తరణకు నోచుకుంటే తప్ప, రాకపోకలకు వీలుగా వుండదు. రానున్న రోజుల్లో అత్యంత రద్దీగా మారుతుంది సచివాలయానికి వెళ్ళే రహదారి.  Readmore!

ఇక, స్థానికుల్ని ఉద్దేశించి హైద్రాబాద్‌ ఉద్యోగులు చేస్తున్న బిగ్గెస్ట్‌ అప్పీల్‌.. 'అద్దెల విషయంలో మా త్యాగాల్ని గుర్తు చేసుకోండి..' అని చెప్పడం. హైద్రాబాద్‌ని మించి కూడా అమరావతిలో కొన్ని చోట్ల అద్దెలున్నాయన్నది కాదనలేని వాస్తవం. అదే సమయంలో, అందరూ అలాగే వున్నారనీ చెప్పలేం. ఉద్యోగులే కాదు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిథులు సచివాలయానికి వెళ్ళే విషయంలో ముందు ముందు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోక తప్పదు. కానీ, సర్దుకుపోవాల్సిందే.

Show comments

Related Stories :