నారావారి 'నంద్యాల' రాజకీయం

ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ పార్టీలు, నాయకులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఉప ఎన్నికలంటే అధికార పార్టీలకు మహా చెడ్డ చికాకు వచ్చిపడ్తుంటుంది. గెలిచేస్తామనే ధీమా వున్నోళ్ళు, మెజార్టీ కోసం తంటాలు పడ్తుంటారు. గెలవలేం అన్న భయం వున్నవాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణలో చాలా ఉప ఎన్నికలు జరిగాయి గడచిన మూడేళ్ళలో. అన్ని ఉప ఎన్నికల్లోనూ అధికార టీఆర్‌ఎస్‌ బంపర్‌ మెజార్టీని దక్కించుకుంది.

మరి, ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి.? తెలంగాణలో టీఆర్‌ఎస్‌లా, జనంలో సత్తా చాటేంత సీన్‌ ఏపీలో టీడీపీకి లేదన్నది నిర్వివాదాంశం. అందుకే, పుత్రరత్నం నారా లోకేష్‌ని, నామినేటెడ్‌ కోటాలో ఎమ్మెల్సీని చేసేసుకుని, మంత్రి పదవి కట్టబెట్టుకున్నారు చంద్రబాబు. కానీ, నంద్యాల రూపంలో చంద్రబాబుని ఇప్పుడు ఉప ఎన్నిక వెక్కిరిస్తోంది. అస్త్ర శస్త్రాలన్నీ సిద్ధం చేసుకుని, ముఖ్యమంత్రి చంద్రబాబు నంద్యాల ఎన్నికల్లో గెలుపుకోసం నానా తంటాలూ పడ్తున్నారు.

నిజానికి, నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపు బాధ్యత భూమా కుటుంబానిదే. కానీ, అక్కడ తానే స్వయంగా పోటీ చేస్తున్నంత స్థాయిలో చంద్రబాబు, నంద్యాల ఉప ఎన్నికలపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తంగా మంత్రులంతా కర్నూలు జిల్లా నంద్యాలని కేంద్రంగా చేసుకుని, అక్కడే పాగా వేసేసి.. ఇంకా ప్రకటితం కాని ఉప ఎన్నికల వ్యవహారాల్ని చక్కబెట్టేస్తున్నారు.

చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ వీలు చిక్కినప్పుడల్లా నంద్యాలలో దర్శనమిస్తుండడం గమనార్హం. వివిధ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు కూడా నంద్యాలలో ముందు ముందు తాత్కాలికంగా మకాం వేసేయనున్నారట. నేతలు సరే, ఓటర్లని కూడా అధికార పార్టీ ఇలాగే తీసుకొస్తుందా.?

అధికార పార్టీ అభద్రతాభావానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? 'మీకేం కావాలో కోరుకోండి..' అంటూ నంద్యాల నియోజకవర్గ ప్రజలకు చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించేస్తున్నారు. 'గెలుపు అవసరం' అలాంటిది.. మరి. అన్నట్టు, సీరియస్‌గానే అన్నారో అనుకోకుండా అనేశారోగానీ మొన్నామధ్య, 'ఏం ఓటుకి ఐదు వేలు నేను ఇవ్వలేనా..' అని ఆయన అన్నట్టుగానే, అప్పుడే ఓటు 'విలువ'పై తెలుగు తమ్ముళ్ళు నంద్యాల నియోజకవర్గంలో అత్యుత్సాహం చూపేస్తున్నారట.

5వేలు ఏం ఖర్మ, అవసరమైతే ఓటుకి పది వేలు ఖర్చు చేయడానికైనా అధికార పార్టీ సిద్ధపడుతుందన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. రాజధాని అమరావతి పరిధిలో, ఓ వార్డు మెంబర్‌ని గెలిపించుకోవడానికి ఓటుకి 7వేలు ఖర్చు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ ఖాతాలోనే వుంది మరి. ఆ రికార్డ్‌ని నంద్యాల ఉప ఎన్నిక చెరిపేయకుండా వుంటుందా.?

Show comments