అవినీతి గురించి మరీ అంత ఓపెన్ గానా?

రాజకీయాల్లో అవినీతి ఇవాళ్టి రోజుల్లో చాలా సహజం అయిపోయింది. అవినీతిలో ఎక్కువ తక్కువల గురించి మాట్లాడుకునే వాళ్లే తప్ప  అసలు అవినీతి ఉండకూడదని ప్రజలు కూడా కోరుకోవడం లేదేమో అనిపించేంత సహజంగా.. ఇలాంటి చాటు మాటు వ్యవహారాలు రివాజుగా మారిపోయాయి. అయితే అంతమాత్రాన బహిరంగంగా దాన్ని గురించి మాట్లాడేవాళ్లు.. ఈ రంగంలో అవినీతి ఉందని ఒప్పుకునే వాళ్లు మాత్రం ఎవరూ ఉండరు.

ఇప్పుడు తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మాత్రం ఈ విషయంలో చాలా బోల్డ్ గా మాట్లాడుతున్నారు. తెరాస ప్రభుత్వం అని మాత్రమే కాదు, ఏ ప్రభుత్వంలో అయినా ఎవరైనా సరే అవినీతి లేదు అని చెబితే అది అబద్ధమే అని ఆయన బహిరంగ వేదిక మీదే అంటున్నారంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కాకపోతే.. ఈ అవినీతిని క్రమంగా తగ్గించడానికి మాత్రం తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని కేటీఆర్ వక్కాణిస్తున్నారు. పైగా ఎన్నికల్లో నాయకులు విపరీతంగా ఖర్చు చేస్తున్నంత కాలమూ అవినీతి ఇలాగే వర్ధిల్లుతుంటుందని కూడా ఆయన ఇండైరక్టుగా హింట్ ఇస్తున్నారు. 

రాజకీయ అవినీతికి మూలాలు ఎక్కడుంటాయి? జనం డబ్బు తీసుకుని ఓట్లు వేస్తుండడం వలన నాయకులు అవినీతి సంపాదనకు అలవాటు పడుతున్నారా? వారు అవినీతి పరులు గనుక జనం డబ్బు తీసుకుని ఓట్లు వేస్తున్నారా? అంటే.. చెట్టు ముందా? విత్తు ముందా? లాంటి ప్రశ్న ఇది. ఒకరి మీద ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ అవినీతిని మాత్రం సహజపరిణామంగా మార్చేస్తున్నారు.

కానీ కేటీఆర్ మాత్రం.. ఎన్నికల్లో ఖర్చు విషయంలో పరిమితులు మారడం దీనికి ఒక పరిష్కారంగా సూచిస్తున్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కార్పొరేట్ డొనేషన్లు కొనసాగినంత కాలమూ.. పొలిటికల్ కరప్షన్ కొనసాగుతూనే ఉంటుందని, ఏ ప్రభుత్వంలో అయినా అవినీతి ఉండే తీరుతుంది. తమ ప్రభుత్వంలో అవినీతి లేదని ఎవరైనా చెబితే అది అబద్ధమే.  టీఆర్ఎస్ ప్రభుత్వమైనా, మరో ప్రభుత్వమైనా ఇదే వర్తిస్తుంది అంటూ కుండబద్ధలు కొట్టి చెప్పడం విశేషం. 

ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు పరిమితి వాస్తవదూరంగా ఉందని... ఎన్నికల ఖర్చుపై కేంద్రం, ఎన్నికల సంఘం వాస్తవ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన సూచిస్తున్నారు. ఎన్నికల్లో చాలా తక్కువ ఖర్చుకు మాత్రమే అనుమతించడం వలన.. అభ్యర్థులు అనివార్యంగా బ్లాక్ మనీని కూడా వెచ్చిస్తున్నారు. బ్లాక్ మనీ కోసం అవినీతికి పాల్పడుతున్నారు అనేది కేటీఆర్ అభిప్రాయంగా ఉంది.

అయితే.. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. నాయకులు ఎన్నడూ ఎన్నికల ఖర్చుకు సరిపడేంత అవినీతికి మాత్రమే పాల్పడ్డం లేదు. చాన్సు దొరికితే.. కోట్లకు కోట్లు కుమ్మేస్తున్నారు. ఎన్నికల్లో ఖర్చు పరిమితిని ఎన్నికల సంఘం పెంచినంత మాత్రాన... ఆ మేరకు లీగల్ గా సంపాదించుకుని, ఆతర్వాత ఎలాంటి అవినీతికి పాల్పడకుండా ఉంటారా అనేది అనుమానమే. నాయకుల వైఖరిలో.. ఇబ్బడిముబ్బడిగా సంపాదించేయాలనే ఆటిట్యూడ్ మారనంత వరకూ రాజకీయ అవినీతి ఇలాగే వర్ధిల్లుతుంటుందని కేటీఆర్ తెలుసుకోవాలి.

Show comments