ఇసుకాసురులపై చర్యలు సాధ్యమేనా?

తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇటీవల కలెక్టర్‌గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన కార్తికేయ మిశ్రా హెచ్చరించారు. అన్ని ఇసుక రీచ్‌లలో యంత్రాల వినియోగంపై ఉన్న నిషేదాన్ని పటిష్టంగా అమలుచేస్తామన్నారు. ఇసుక తవ్వకాలు, రవాణా తదతర ప్రక్రియల్లో అక్రమాలను సహించేది లేదన్నారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఇసుక రీచ్‌లలో ఎక్కడా యంత్రాలను వినియోగించరాదన్నారు. ఈ నిషేదాన్ని అమలుచేసేందుకు మండలస్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌లు కృషి చేస్తాయన్నారు.

జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు డివిజన్‌, మండల స్థాయి అధికారులను దీనిపై అప్రమత్తం చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఇసుక రీచ్‌లు అన్నిటిలోను కచ్చితంగా ఈ ఆదేశాలు అమలయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. రీచ్‌లలో ఇసుక లోడింగ్‌ ప్రక్రియను ముందు వచ్చిన వారికి ముందు వడ్డన పద్ధతి (ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌)ని పాటించాలన్నారు. ర్యాంపుల వారీగా స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని, లోడింగ్‌, ట్రాన్స్‌పోర్ట్‌, నిర్వహణ ఛార్జీలను నిర్ణయించే అధికారాన్ని ఆయా ఆర్డీఓలు, సబ్‌ కలెక్టర్లకు కల్పించారు. నిర్దేశించిన ధరలు, నియమ నిబంధనలను బోర్డులపై రాయించి, రీచ్‌ల వద్ద విధిగా ప్రదర్శించాలని కలెక్టర్‌ ఆదేశించారు.

ఏ రీచ్‌లోనూ అవసరానికి మించి ఎక్కువ పరిమాణంలో ఇసుకను అక్రమంగా నిల్వచేస్తే సహించేది లేదన్నారు. దీనిపై నిరంతరాయంగా నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. రెవెన్యూ, పోలీస్‌, మైనింగ్‌, పంచాయతీ సిబ్బంది, అధికారులతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ టీములు ఇసుక రీచ్‌లపై నిఘా పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. కాగా ఎక్కడా అక్రమ ఇసుక తవ్వకాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కలెక్టర్‌ ప్రకటించిన నేపథ్యంలో ఇది అధికార పార్టీ నేతలకు మింగుడుపోని విధంగా మారింది. ఎందుకంటే జిల్లాలో అక్రమ ఇసుక వ్యాపారంలో తెలుగుదేశం పార్టీకి చెందిన వారే అధికారంగా ఉన్నారు. అలాగే పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు జిల్లాలో శ్యాండ్‌ సిండికేట్‌కు వెన్నుదన్నుగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అధికార పార్టీ నేతలను కాదని కలెక్టర్‌ ఏమైనా చేయగలరా? అన్న వాదన ఆయా వర్గాల నుండి బలంగా వినిపిస్తోంది.

Show comments