పన్నీరు నవ్వుతున్నాడు.. వాట్ నెక్ట్స్?

శశికళ కు శిక్ష ధ్రువీకరణ కావడంతో సంబరాలు చేసుకుంటోంది పన్నీరు సెల్వం వర్గం. పన్నీరు ఇంటి బయట స్వీట్ల పంపిణీలు జరుగుతున్నాయి. పన్నీరు ఇంటికి అన్నాడీఎంకే కార్యకర్తలు దూసుకొస్తున్నారు. ఇక పన్నీరుకు ఎదురులేదు అనే మాట వీరు చెబుతున్నారు. వీరి ఆనందం సంగతలా ఉంటే.. ఇప్పుడేం జరుగుతుందనేది అత్యంత ఆసక్తికరంగా మారింది.

ఒకటి.. శశికళ జైలుకు వెళ్లినంత మాత్రాన ఎమ్మెల్యేలంతా పన్నీరు ఇంటి ముందు క్యూ కడతారని అనుకోవడానికి లేదు. శశికళ పరిస్థితి ఏమిటో తెలిసి కూడా చాలా మంది ఎమ్మెల్యేలు ఆమె వెంటే ఉన్నారంటే.. వాళ్లకు పన్నీరుపై ఏమాత్రం సానుకూల దృక్పథం లేదని స్పష్టం అవుతోంది. కాబట్టి.. ఇప్పటికీ పన్నీరుది కేవలం ఆశవహ పరిస్థితి మాత్రమే!

రెండు.. తమలో ఎవరో ఒకరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా మార్చుకుని..శశి దగ్గర ఉన్న ఎమ్మెల్యేలంతా ఏక వాక్యం మీద నిలబడగలిగితే పన్నీరుకు అప్పుడు చుక్కలే! అందుకే వ్యూహాత్మకంగా జయ బంధువులెవరినో రంగంలోకి దించాలని భావిస్తోందట శశికళ.

ఎవరో ఒకరిని నేతగా రంగంలోకి దించుకుని.. శశి దగ్గర ఉన్న ఎమ్మెల్యేలంతా ఏకంగా నిలిచి, జైలుకు వెళ్లినా.. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశి కొనసాగుతుందని ప్రకటించి, కథను నడిపించడానికి శశి ప్రయత్నించవచ్చిప్పుడు.

ఇదే సమయంలో.. డీఎంకే కూడా వేగంగా పావులు కదిపే అవకాశం ఉంది. శశి వర్గం నుంచి పన్నీరు వైపు వెళ్లడానికి ఇష్టపడని ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకునేయత్నం చేయవచ్చు స్టాలిన్. ఎలాగూ డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య పెద్దగా సీట్ల వ్యత్యాసం లేదు. పన్నీరుకు ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేంత ఛరిష్మా లేదనే విషయంలపై ఫుల్ క్లారిటీ వచ్చింది.

అయితే డీఎంకేకు కేంద్రం సహకరించదు. పన్నీరునే నిలబెట్టుకోవాలనేది బీజేపీ భావన. అయితే ఆయన బలనిరూపణకు శశి వర్గం ఎమ్మెల్యేల ఎంత వరకూ సహకరిస్తారనేది.. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరిగింత వరకూ కూడా స్పష్టత లేని అంశం. అయితే.. ఇకపై పరిణామాలు వేగంగా మారతాయనేది మాత్రం  స్పష్టమవుతున్న విషయం.

Show comments