కమల్‌ను దువ్వుతున్న కమలదళం!!

మోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో కూడా విస్తరించడానికి, దేశవ్యాప్తంగా అంతో ఇంతో తమ ఉనికిని చాటుకోవడానికి అచ్చమైన సాంప్రదాయ రాజకీయ పోకడలనే అనుసరిస్తోంది. తమిళనాడులో తమకంటూ వారికి పెద్ద సీన్ లేకపోవడంతో, అక్కడ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చాలాకాలంగా ఎగబడుతున్న భారతీయ జనతా పార్టీకి లడ్డూ లాంటి అవకాశం లాగా ఇప్పుడు కమల్ హాసన్ కనిపిస్తున్నారు. తమిళ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లుగా సంకేతాలు ఇస్తున్న కమల్ హాసన్.. అక్కడ ప్రకంపనాలు సృష్టిస్తున్నారు. కమల్ను ప్రసన్నం చేసుకుని ముందుగానే తమ పార్టీకి అనుకూలంగా మార్చుకుంటే గనుక.. పొత్తులు పెట్టుకుని లాభపడగలం అని జాతీయస్థాయిలో భారతీయ జనతా పార్టీ కూడా భావిస్తున్నట్లుంది. అందుకే కాబోలు.. కమల్ పార్టీ పెట్టడానికంటె ముందే.. ఆయనను దువ్వే ప్రయత్నం చేస్తోంది. ఆయన ఎన్నికల్లోకి ప్రవేశిస్తే తాము సహకరిస్తాం అంటూ సంకేతాలు ఇస్తోంది. 

కొన్ని రోజులుగా తమిళ రాజకీయాల్లో కమల్ హాసన్ ప్రకంపనాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మొత్తం అవినీతి మయం అయిపోయిందంటూ కమల్ ఇటీవల వ్యాఖ్యానించి ఒక సంచలనం సృష్టించారు. ఆయన కామెంట్లకు అన్నా డీఎంకే మంత్రులు కౌంటర్ ఇచ్చారు. దీనిపై కమల్ మళ్లీ రెచ్చిపోయారు. తన అభిమానులంతా తాను ఇచ్చే పిలుపు కోసం సిద్ధంగా ఉండాలంటూ మరో ట్వీట్ చేశారు. తాజాగా మంత్రులు అవినీతికి సాక్ష్యాలు చూపాలని అనేసరికి ప్రజలకు పిలుపు ఇచ్చి ఆయా శాఖల అధికారిక వెబ్ సైట్లలోనే ప్రజలంతా... అవినీతి వ్యవహారాల గురించి ఫిర్యాదులు చేసేలా వారిని ప్రేరేపించారు. సొంత రాజకీయ పార్టీ స్థాపించే దిశగా కమల్ హాసన్ అడుగులు వేస్తున్నట్టు స్పష్టంగానే కనిపిస్తోంది.

అయితే ఈ అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ తనకు అనుకూలంగా వాడుకోదలచుకుంటోంది. తమిళనాడులో ప్రస్తుతం డీఎంకే- కాంగ్రెస్ తో జట్టుకట్టి ఉంది. అన్నాడీఎంకే స్వతంత్రంగానే ఉన్నప్పటికీ.. మోడీ దళానికి కొమ్ముకాస్తూనే ఉంది. తాజాగా వెంకయ్యనాయుడుకు మద్దతు ఇవ్వబోతున్నట్లు కూడా వారు ప్రకటించారు. అయితే కమలనాధులు మాత్రం కమల్ హాసన్ ను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. జయలలిత మరణం ద్వారా ఖాళీ అయిన ఆర్‌కె నగర్ ఎమ్మెల్యే స్థానానికి ఉప ఎన్నికలో.. కమల్ హాసన్ బరిలోకి దిగితే గనుక తాను తప్పుకుంటానని.. ఇప్పటికే అక్కడ భాజపా తరఫున పోటీ చేయాలని అనుకుంటున్న కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్ ప్రకటించారు. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ కూడా కమల్ కే జై కొడుతున్నారు. పాండిచ్చేరి గవర్నర్ కిరణ్ బేడీ కూడా కమల్ అనుకూల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇదంతా గమనిస్తోంటే.. కమల్ హాసన్ పార్టీ అంటూ పెడితే.. తమ జట్టులో కలిపేసుకోవాలని కమలదళం ఉత్సాహపడుతున్నట్లుంది. 

Readmore!
Show comments

Related Stories :