ఆపరేషన్ శశికళ ముగిసినట్లే కన్పిస్తోంది. శశికళను జైలుకు పంపించడం ద్వారా, 'ఢిల్లీ పెద్దలు' తమ 'ఆపరేషన్'ని ముగించినట్లుగా భావిస్తున్నారట. ఇక, ఇప్పుడు తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు దిశగా సరైన నిర్ణయం రావడమొక్కటే మిగిలి వుంది. 'గవర్నర్ విశేష అధికారాలు..' అనే పేరుతో, తమిళనాడులో ఎంత 'రొచ్చు' రాజకీయాన్ని కేంద్రం నడిపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!
పేరు గవర్నర్ విద్యాసాగర్‌రావుదైతే, పెత్తనం ప్రధాని నరేంద్రమోడీది. మోడీ కనుసన్నల్లోనే మొత్తం తమిళనాడు రాజకీయం నడిచింది. పన్నీర్ సెల్వంని తెరవెనకాల వుండి నడిపించింది సాక్షాత్తూ నరేంద్రమోడీనే. లేకపోతే, ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే కూడా తన వెనకాల లేకుండానే, అధికార అన్నాడీఎంకే పార్టీలో తిరుగుబాటు బావుటాని 'పన్నీర్' ఎలా ఎగరవేయగలరు.?
శశికళ జైలుకు వెళ్ళడంతో అన్నాడీఎంకే నుంచి పళనిస్వామి తెరపైకొచ్చారు. ఆయనే ఇప్పుడు ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి. 119 మంది ఎమ్మెల్యేల బలం తనకుందంటూ పళనిస్వామి ఇప్పటికి రెండుసార్లు గవర్నర్‌ని కలిసి స్పష్టం చేశారు. దాంతో గవర్నర్‌కి ఇంకో ఆప్షన్ లేకుండా పోయింది. ఇంకా ఎక్కువ కాలం ఈ 'సంక్షోభ నాటకం' కొనసాగే అవకాశం కూడా కన్పించడంలేదు. మధ్యాహ్నం నాటికి గవర్నర్ నుంచి, పళనిస్వామికి 'ప్రభుత్వ ఏర్పాటు'పై సమాచారం అందవచ్చుననే ప్రచారం జరుగుతోంది.
ఇంతకీ, ఇన్ని రోజులపాటు పన్నీర్ సెల్వం ఏం చేయగలిగినట్లు.? పది మందికి పైగా ఎంపీలనైతే ఆకర్షించారుగానీ, ఎమ్మెల్యేలని మాత్రం కనీసం రెండంకెలకు చేర్చలేకపోయారు. మొత్తం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా తనవైపే వుంటారని చెప్పిన పన్నీర్ సెల్వం, 25 మంది ఎమ్మెల్యేలను కూడా తనవైపుకు తిప్పుకోలేకపోవడం ఆశ్చర్యకరం. 'నాయకుడిగా' ఆయన సమర్థతను ఈ ఈక్వేషన్ చెప్పకనే చెబుతోంది.
ఎలాగైతేనేం శశికళ ముఖ్యమంత్రి అవకుండా చూడగలిగాం.. అన్నాడీఎంకే పార్టీలో చిచ్చు రేపగలిగాం.. అన్న సంతృప్తి మాత్రం బీజేపీకి కలుగుతుంది. శశికళ అవినీతికి పాల్పడ్డారు గనుక, తమ ప్రభుత్వం అవినీతిపరుల్ని ఉపేక్షించదు గనుక.. అంటూ బీజేపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతుండడంతోనే ఆ పార్టీ వ్యూహం తమిళనాడు రాజకీయాలపై సుస్పష్టం.
అంతా బాగానే వుందిగానీ, బల నిరూపణ సమయంలో ప్రతిపక్షం డీఎంకే చక్రం తిప్పితే.? ఆల్రెడీ సంక్షోభంలో వున్న అన్నాడీఎంకే తరఫున పళనిస్వామి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే.! ఇంకేముంది, తమిళనాడులో మళ్ళీ ఎన్నికలు జరగొచ్చు.. లేదంటే ఎవరూ ఊహించని విధంగా డీఎంకే అదృష్టం కలిసొచ్చి, అధికారంలోకి రావొచ్చు కూడా.!