టీడీపీ అధ్యక్ష పదవికి పోటీ!

రాజకీయమంటేనే పదవి. ప్రభుత్వ పదవి దక్కితే చాలా మంచిది. అదికుదరకపోతే పార్టీ పదవిలోనైనా కుదురుకుపోవాలి. ఇదీ నయా రాజకీయ నీతి. ఈ సూత్రాన్ని బాగా వంటబట్టించుకున్న తెలుగు తమ్ముళ్లు పార్టీ పదవులపై గురి పెడుతున్నారు. ఎటూ నామినేటేడ్‌ పోస్టుల భర్తీ జరగడంలేదు, జీవీఎంసీ ఎన్నికలు నిర్వహించడంలేదు, దాంతో, అధికార పార్టీ అధ్యక్ష హోదాను అనుభవించాలని తెగ తాపత్రయపడుతున్నారు. మహానాడులోగా సంస్ధాగత ఎన్నికలు పూర్తి చేయనుండడంతో విశాఖ అర్బన్‌ జిల్లా అధ్యక్ష పదవికి డిమాండు ఏర్పడింది. ఇంతవరకూ ఈ పదవిని నిర్వహించిన విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ తనకు ఆ భారం వద్దు అంటున్నారు. వ్యయ ప్రయాసలతో కూడుకున్న ఈ పదవిని నిర్వహించడం కంటే తన నియోజకవర్గం పనులను చూసుకోవడమే బెస్ట్‌ అనుకుంటున్నారు. దాంతో, ఈ పదవి కోసం మాజీ టీడీపీ అధ్యక్షుడు ఎస్‌ఎఏరహమాన్‌ తన వంతుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. 

ఆయన పరిస్థితి ఎలా తయారైందంటే ఇటీవల కాలంలో ఏ పదవిని ఆశించినా అది దక్కడంలేదు. వుడా అధ్యక్ష పదవిపై గురి పెడితే దానిని విశాఖ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటిగా మార్చేశారు, జీవీఎంసీ మేయర్‌పై కన్ను వేస్తే ఆ ఎన్నికలు కాస్తా ఇప్పట్లో జరగవని తేలిపోయింది. రాష్టస్ధాయి కార్పొరేషన్‌ చైర్మన్‌గిరీ అడిగినా రిక్తహస్తమే ఎదురైంది. ఇపుడు అర్బన్‌ అధ్యక్ష పదవికోసం అర్రులు చాస్తున్నారు. ఇందుకోసం మంత్రి గంటా ద్వారా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే, గంటా అనుచరుడికి ఈ పదవి దక్కకూడదన్న ఉద్దేశ్యంతో మరో మంత్రి అయ్యన్నపాత్రుడు తన వంతుగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి సన్నిహిత బంధువు పట్టాభి పేరును తెరపైకి తీసుకువస్తున్నారు. 

ఈ ఇద్దరికీ పోటీ తీవ్రంగా ఉండగానే, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును కూడా గంటా దువ్వుతున్నారు. ఎమ్మెల్యేకు అధ్యక్ష పదవి అప్పగిస్తే అర్ధబలం, అంగబలం తోడవుతాయన్న అధినాయకత్వం ఆలోచనలకు అనుగుణంగా గంటాపై ఎత్తు వేస్తున్నారు. ఇక, అధ్యక్ష పదవిలో ఉంటే వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యే టిక్కెట్‌కు ఢోకా ఉండదన్న దూరాలోచనతో మరికొందరు కూడా రేసులో ఉన్నారు. ఎవరికి పదవి అప్పగించినా వర్గపోరు తప్పదన్నది పార్టీ కేడర్‌ అభిప్రాయంగా ఉంది.

Show comments