మీడియానే నట్టేట్లో ముంచేసిందా.?

రాజకీయాలపై మీడియా ప్రభావం అంతా ఇంతా కాదు. ఆ ప్రభావం మంచి కోసం కాకుండా, దురదృష్టవశాత్తూ రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం పనిచేస్తున్న రోజులివి. మన దేశంలోనే పరిస్థితి ఇలా వుందనుకుంటే, అమెరికాలో పరిస్థితి ఇంకా ఘోరంగా తయారయ్యింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ అక్కడి మీడియా వ్యవహరించిన తీరు అందర్నీ విస్మయానికి గురిచేసింది. 

రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌కి మీడియా మద్దతు లేదు. అదే, డెమోక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ విషయంలో అయితే, ఆమెను పల్లకీలోకి ఎక్కించి మరీ అక్కడి మీడియా మోసేస్తూ వచ్చింది. అసలంటూ హిల్లరీకి, ట్రంప్‌ పోటీదారుడే కాదని అమెరికన్‌ మీడియా తేల్చేసింది. అయితే, అది గతం. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఒక్కసారిగా కాదు, క్రమక్రమంగా అమెరికా రాజకీయాలు అనూహ్యమైన మలుపులు తిరుగుతున్నాయి. 

తొలిసారిగా డోనాల్డ్‌ ట్రంప్‌, హిల్లరీపై ఆధిక్యం సంపాదించారు.. సర్వేల పరంగా. తాజా సర్వేలో ట్రంప్‌కి 46 శాతం, హిల్లరీకి 45 శాతం మంది మద్దతు లభించింది. ఇదొక్కటి చాలు, ట్రంప్‌ దూకుడు ఏ స్థాయిలో వుందో చెప్పడానికి. ఇప్పటిదాకా అసలంటూ ట్రంప్‌ని స్ట్రాంగ్‌ కంటెండర్‌గా కూడా అమెరికన్‌ మీడియా భావించిన పరిస్థితి లేదు. చిత్రంగా అమెరికన్‌ మీడియాతోపాటు, ప్రపంచ మీడియా అంతా హిల్లరీకే మద్దతు పలికింది చాలావరకు. 

మన తెలుగు మీడియా తక్కువేమీ తిన్లేదు. అమెరికాలోని భారతీయులే కాకుండా, అమెరికన్లు, ఇతర దేశాల నుంచి వెళ్ళి అక్కడే స్థిరపడ్డవారు అంతా గంపగుత్తగా హిల్లరీ క్లింటన్‌ వైపే మొగ్గు చూపుతున్నారని తేల్చేసింది. కానీ, ట్రంప్‌ చేష్టలు ఎలా వున్నాసరే, ఆయన పట్ల అమెరికన్లలో సానుకూలత తక్కువేమీ కాదన్న విషయం క్రమక్రమంగా బయటపడుతూ వచ్చింది. ఇప్పుడు దాదాపుగా ఓ క్లారిటీ వచ్చేసింది. ఏమో గుర్రం ఎగరావచ్చు.. అనే స్థాయిలో ట్రంప్‌ అమెరికా అధ్యక్ష పీఠమెక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాగని హిల్లరీని పూర్తిగా తీసి పారెయ్యడానికి లేదు. పోటీ మాత్రం చాలా తీవ్రంగా వుందనే వాస్తవం అయితే బయటపడిందిప్పుడు. 

ఇదిలా వుంటే, హిల్లరీ ఈ-మెయిల్‌ కుంభకోణంపై అమెరికన్‌ ఎఫ్‌బిఐ రచ్చ రచ్చ చేసేస్తోంది. ఇది ఆమె మద్దతుదారులకు ఏమాత్రం రుచించడంలేదాయె. నిన్న మొన్నటిదాకా పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. హిల్లరీ శిబిరంలో ఆందోళన సుస్పష్టం. 'ఏమన్నా చేసుకోండి..' అంటూ ఓపెన్‌ ఛాలెంజ్‌ చేసిన హిల్లరీ వర్గం, ఇప్పుడు ఇ-మెయిల్‌ వివాదంపై గుస్సా అవుతోంది. 

మొత్తమ్మీద, మీడియాని నమ్మి.. తన గెలుపుకి ఢోకా లేదని ధీమాతో విర్రవీగిన హిల్లరీలో కొత్త కోణం ఇప్పుడిప్పుడే బయటపడ్తోంది. కంపు.. అనుకున్న ట్రంపు.. అనూహ్యంగా పుంజుకున్నాడు..  రోజులు మారాయి.. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఇంకా రసవత్తరంగా మారాయి. చూద్దాం, అతి త్వరలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న దరిమిలా, ఏం జరుగుతుందో.!

Show comments