ఫస్ట్ - ఏసీలో ఎలుకల బెడద, మంత్రికి నటీమణి ఫిర్యాదు!

మోడీ వచ్చాకా.. రైళ్లన్నీ టైముకు నడుస్తున్నాయ్.. అని  ఆ మధ్య ఒక పాపులర్ కమేడియన్ చేత డైలాగు  చెప్పించారొక తెలుగు సినిమాలో! అలాగే మోడీ వచ్చాకా రెట్టింపు స్థాయికి పెరిగిన రైల్ టికెట్ల విషయంలో భక్తులు.. బ్రహ్మాండమైన మాటలు చెబుతూ ఉంటారు, రైళ్లలో ఇప్పుడు దుర్గంధమే లేదని సెలవిస్తూ ఉంటారు! అయితే దేశంలోని ఏ మూలన, ఏ రైళ్లో అయినా.. ఒక్క రాత్రి జనరల్ కంపార్ట్ మెంట్ లో ఇలాంటి వారి చేత జర్నీ చేయిస్తే పరిస్థితి స్పష్టం గా అర్థం అవుతుంది. ఇక వేరే కామెంట్లకు కూడా అవకాశం ఉండదు.

జనరల్ బోగీ స్టాండర్డ్స్ సంగతలా ఉంటే.. ఫస్ట్ క్లాస్ ఏసీలో ప్రయాణ అనుభవాన్ని రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుకు ట్విటర్ ద్వారా తెలియ జేసింది మరాఠా నటి నివేదిత సరఫ్. తను ప్రయాణించిన రైలు నంబరు తో సహా చెప్పి.. రైళ్లో తన హ్యాండ్ బ్యాగ్ ను ఎలుకలు కొట్టి దాన్ని పనికి రాకుండా చేసిన విధానాన్ని ఆమె  రైల్వే మంత్రికి ట్విటర్ ద్వారా తెలియ జెప్పింది. ఆయనకు ట్యాగ్ చేసి.. ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీల్లోనే పరిస్థితి ఎలాఉందో వివరించింది.

ఇక ఈ ఫిర్యాదు పట్ల రైల్వే మంత్రి పీఆర్ వో రొటీన్ గానే స్పందించారు. “ రైల్వే లో పెస్ట్ కంట్రోల్ డిపార్ట్ మెంట్ ఉంది. వాళ్లు బాగానే చేస్తున్నారు. అయితే ఎక్కడో చిన్న పొరపాటు.. ఈ ఫిర్యాదును స్వీకరిస్తున్నాం. చక్కదిద్దుతాం..’’ అంటూ తాపీగా మరో ట్వీట్ పెట్టారు.

మరి ఫస్ట్ క్లాస్ ఏసీలో జర్నీ చేసేంత స్థాయి వ్యక్తి కాబట్టి.. ప్రయాణంలో తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె కేంద్ర మంత్రికి తెలియజేయగలిగింది. ఆమె నటీమణి కాబట్టి మీడియా కూడా.. ఆమె ఫిర్యాదుకు ప్రాధాన్యతను ఇస్తోంది. మరి సాధారణ బోగీల్లో ప్రయాణించే సాధారణ మనుషుల పరిస్థితి ఏమిటి?

అయినా.. రైళ్లలో ఇలాంటి ఎలుకల బాధ లేకుండా చేయడానికి కేంద్రం ఒక ప్రణాళిక రచించాలి, దాని కోసం సిబ్బంది, పెస్ట్ కంట్రోల్ అవసరం లేకుండా.. బోగీకి ఒక పిల్లిని వదిలితే సరిపోతుందేమో!

Show comments