రేపటి బంద్‌పై పవన్‌ ఎఫెక్ట్‌ ఎంత.?

నా వెనుక ఎవరూ లేరు.. ఏం, నాకు ఎవరన్నా వెనకాల సపోర్ట్‌ కావాలా.? నాకు ఆత్మగౌరవం లేదా.? అంటూ ఏవేవో మాటలు చెప్పేశారు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌, కాకినాడలో నిర్వహించిన 'సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ'లో. ఆయన చెప్పాలనుకున్నది చెప్పారు బాగానే వుంది. 

'బంద్‌లలో పాల్గొనమని నేను చెప్పను, పాల్గొనవద్దని కూడా చెప్పను.. అది నీ ఇష్టం.. మీరెందుకు కష్టపడాలి.?' అంటూ పవన్‌ మరో డైలాగ్‌ పేల్చారు. ఇక్కడే తేడా కొట్టేసింది. ఎక్కడో పవన్‌ వెనకాల ఎవరో వుండి, ఈ డైలాగ్‌ చెప్పించారనే భావన కలుగుతోంది. ప్రజాస్వామ్యంలో 'బంద్‌' అనేది ఓ నిరసన మార్గం. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. 

ఏ బంద్‌కి అయినా సరే, ప్రజల మద్దతు లేకపోతే అట్టర్‌ ఫ్లాప్‌ అయిపోతుంది. అఫ్‌కోర్స్‌.. ప్రభుత్వాలు కొరడా ఝుళిపించినా బంద్‌లు విఫలమవడమో, ఉద్రిక్త పరిస్థితులకు దారి తీయడమో జరుగుతుంటుందనుకోండి.. అది వేరే విషయం. తెలంగాణ ఉద్యమకాలంలో టీఆర్‌ఎస్‌ ఎప్పుడు బంద్‌కి పిలుపునిచ్చినా సూపర్‌ హిట్‌ అవుతూ వచ్చేది. ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రతిపక్షం బంద్‌కి పిలుపునిస్తోంటే, సూపర్‌ సక్సెస్‌ అవుతూ వస్తోంది. ఆయా డిమాండ్లతో ఆయా పార్టీలు బంద్‌కి పిలుపునిచ్చినప్పుడు, అందులోని నిజాయితీని ప్రజలు బేరీజు వేసుకుంటుంటారు. స్వచ్ఛందంగా బంద్‌కి మద్దతిస్తున్నట్లు ప్రజలే చెబుతుండడం చూస్తున్నాం. 

అయినా, రేపటి బంద్‌ రాజకీయ ఉద్దేశ్యాలతో జరుగుతున్నది కాదు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా జరుగుతున్నది. ఈ ఒక్క విషయంలో పవన్‌, ఆచి తూచి స్పందించి వుంటే పరిస్థితి ఇంకోలా వుండేది. మొదటి నుంచీ పవన్‌కళ్యాణ్‌ సభకి తెరవెనుక సహాయ సహకారాల్ని టీడీపీ అందిస్తోందనే ఆరోపణలున్నాయి. 'పవన్‌ సభ వెనుక కొన్ని శక్తులున్నాయి.. ఆ శక్తులే బీజేపీ మీద విమర్శలు చేయించాయి..' అని బీజేపీ కూడా విమర్శించేసింది. 

సో, ఇక్కడ మేటర్‌ క్లియర్‌.. సభ సంగతెలా వున్నా, బంద్‌ విషయంలో పవన్‌ వ్యాఖ్యల్ని చూస్తోంటే మాత్రం, ఇంకా పవన్‌ వెనుకాల టీడీపీనే వుందనే భావన బలపడకుండా వుంటుందా.? చూద్దాం, రేపటి బంద్‌పై పవన్‌ ఎఫెక్ట్‌ ఎలా వుంటుందో.. అసలు పవన్‌ పిలుపుని అభిమానులైనా లెక్క చేస్తారో లేదో.!

Show comments