డిక్కీ బలిసిన 'డాష్‌': ఏంటిది రోజా మేడమ్‌.!

రాజకీయాల్లో వున్నాసరే, సినిమాలపై మోజు బహుశా ఎమ్మెల్యే రోజాకి తగ్గదేమో.! వీలు చిక్కినప్పుడల్లా రాజకీయాల్లోనూ సినిమా డైలాగులు చెబుతుంటారామె. బహుశా అదే ఆమె సక్సెస్‌ సీక్రెట్‌ కావొచ్చుగాక.! 

'ఆగడు' సినిమాలో మహేష్‌బాబు చెప్పే డైలాగొకటుంటుంది 'డిక్కీ బలిసిన కోడి చికెన్‌ షాపుకొచ్చి డాన్సేసింది..' అని. ఆ డైలాగ్‌ని, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కి ఆపాదిస్తూ రోజా పంచ్‌ డైలాగ్‌ పేల్చేశారు. 'మండల కమిటీలు ఎలా ఏర్పాటవుతాయో తెలియని లోకేష్‌, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినందుకు టీడీపీ నేతలు సిగ్గుతో తలదించుకోవాలి..' అంటూ దుమ్మెత్తి పోశారు రోజా. 

అంతేనా, ఇంకా చాలా వుంది. లోకేష్‌ని సిమ్‌ కార్డ్‌ లేని సెల్‌ఫోన్‌గా రోజా అభివర్ణించారు. ఇంకా చాలా చాలా ఆరోపణలు చేశారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని లోకేష్‌, అడ్డదారిలో మంత్రి అవుదామనుకుంటున్నారనీ, అలాంటి వ్యక్తి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌కి ఎలా పోటీ అవుతారని రోజా ప్రశ్నించారు. 

2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఒంటరిగా పోటీ చేసిందనీ, బీజేపీతోపాటు పవన్‌కళ్యాణ్‌ని కలుపుకుని చంద్రబాబు పోటీ చేశారనీ.. చంద్రబాబే, వైఎస్‌ జగన్‌కి పోటీ కానప్పుడు లోకేష్‌ ఎలా జగన్‌కి పోటీ అవుతారని రోజా ఎద్దేవా చేశారు. రాజకీయాలన్నాక విమర్శలు సహజమే. కానీ, రోజా చేసే రాజకీయ విమర్శలే కాస్తంత ఇంట్రెస్టింగ్‌గా, ఇంకాస్త వివాదాస్పదంగా వుంటాయి. సెల్‌ఫోన్‌ లేని సిమ్‌కార్డ్‌.. అనీ, డిక్కీ బలిసిన కోడి.. అనీ నారా లోకేష్‌పై రోజా విమర్శలు చేసేశారు సరే.. టీడీపీ నుంచి అంతకు మించిన స్థాయిలో కౌంటర్లు రాకుండా వుంటాయా.? 

ఇక, చంద్రబాబు వీలు చిక్కినప్పుడల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే వుంటారనీ, అవకాశం వుండి వుంటే తాను అమెరికాలో పుట్టేవాడినని చెప్పుకోవడం ద్వారా చంద్రబాబు, దేశద్రోహానికి పాల్పడ్డారనీ, ఈ వ్యాఖ్యలపై తెలుగు మీడియా స్పందించకపోవడం హాస్యాస్పదమన్నారు రోజా. తాను అసెంబ్లీలో చెయ్యని వ్యాఖ్యలపై దుష్ప్రచారం చేసిన తెలుగు మీడియా, చంద్రబాబుని వెనకేసుకురావడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు.

Show comments